CM Revanth Reddy: తెలంగాణలో పథకాల జాతర మొదలవబోతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతోపాటు మేనిఫెస్టోలో అనేక హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో గ్యారంటీలను నమ్మిన ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు. సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణం చేశారు. కొత్త ప్రభుత్వం కొలువు దీరిని రెండు రోజులకే (డిసెంబర్ 9)న రెండు గ్యాంరటీల అమలు ప్రారంభించారు.
మహిళలకు ఫ్రీ బస్..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ఈ క్రమంలో మిగతా హామీలు కూడా వేగంగా అమలు చేస్తారని అంతా భావించారు.
దరఖాస్తుల స్వీకరణ..
గ్యారంటీల అమలుకు ప్రభుత్వం అభయహస్తం పేరిట దరఖాస్తులు స్వీకరించింది. ఏయే పథకాలకు అర్హులు, ఏయే పథకాలు కావాలో దరఖాస్తు పెట్టుకోవాలని వారం రోజుల సమయం ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. 1.20 కోట్ల వరకు దరఖాస్తులు వచ్చాయి. పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, రూ.500లకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గృహలక్ష్మి, తదితర పథకాలకు దరఖాస్తులు వచ్చాయి.
దరఖాస్తు నుంచే రేషన్ కార్డు..
ఇక అభయహస్తం దరఖాస్తుల నుంచే రేవంత్ ప్రభుత్వం రేషన్ కార్డు తప్పని సరి చేసింది. అయితే దీనిపై వ్యతిరేకత వచ్చింది. రేషన్ కార్డు తప్పనిసరి అయితే మొదట రేషన్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రేషన్‌కార్డు లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రేషన్ కారుడ్లు కావాల్సిన వారు దరఖాస్తుపై రేషన్ కార్డు కావాలని పేర్కొనాలని సూచించింది.
ఇక అన్నింటికీ అదే ప్రమాణికం..
దరఖాస్తులు స్వీకరించి నెల దాటినా పథకాల అమలు ప్రారంభించకపోవడంతో ప్రతిపక్షాలు నిలదీయడం ప్రారంభించాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ సాకుగా చూపి గ్యారంటీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని రేవంత్ సర్కార్ చూస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ మరో రెండు గ్యారంటీల అమలుకు కసరత్తు మొదలు పెట్టింది. ఫిబ్రవరి 27 నుంచి ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్, రూ.500లకే ఎల్పీజీ సిలిండర్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు ఈ రెండు పథకాలను ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అయితే ఇక్కడే ప్రభుత్వం ట్విస్టు ఇచ్చింది. ఈ రెండు హామీలకు రేషన్ కార్డు తప్పనిసరి చేసింది. రేషన్‌కార్డు ఉన్నవారికి మాత్రమే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ అందిస్తామని ప్రకటించింది.
మిగతా పథకాలకు కూడా..
తర్వాత అమలు చేసే పథకాలకు కూడా రేషన్ కార్డు తప్పనిసరి చేస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి, పింఛన్, విద్యార్థులకు రుణ భరోసా కార్డులు, విద్యార్థినులకు స్కూటీలు తదితర పథకాలకు కూడా రేషన్ కార్డు ప్రమాణికంగా తీసుకుంటారని అధికారులే చెబుతున్నారు.
కొత్త కార్డులు ఇవ్వకుండా..
అసలు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా పథకాలు అమలు చేయడంతో దాదాపుగా 20 లక్షల మంది నష్టపోతున్నారు. అర్హత ఉన్నా రేషన్ కార్డు లేని కారణంగానే వీరు పథకాలకు దూరం అవుతున్నట్లు అధికారులే పేర్కొంటున్నారు. అభయహస్తం దరఖాస్తుల్లో రేషన్ కార్డు కోసమే 20 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మొదట రేవంత్ సర్కార్ రేషన్ కార్డులు ఇవ్వాలని పేదలు డిమాండ్ చేస్తున్నారు. రేషన్ కార్డులు జారీ చేయకుండా అన్ని పథకాలకు రేషన్ కార్డును ప్రమాణికంగా పెట్టడంపై మండిపడుతున్నారు.