Barc Ratings టీవీ9.. తెలుగు న్యూస్ చానెల్స్ కే ఒక ట్రెండ్ ను సృష్టించిన చానెల్ అదీ. తెలుగులోనే కాదు జాతీయ స్థాయిలో పలు భాషల్లోకి విస్తరించి న్యూస్ చానెల్స్ కు దశా దిశాను నిర్ధేశించింది. అయితే అన్ని రోజులు ఒకలా ఉండవన్నట్టు.. ఇప్పుడీ నంబర్ 1 న్యూస్ చానెల్ కు ఎసరు వచ్చింది. తొలి స్థానాన్ని కోల్పోయి రెండో స్థానంలోకి జారిపోయింది. ఇప్పుడు తెలుగులో నంబర్ 1 న్యూస్ చానెల్ గా మరో అగ్ర చానెల్ అవతరించింది.

ఎన్టీవీ.. తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ర్యాంకును చేజిక్కించుకొని టీవీ9కు షాకిచ్చింది. 24 గంటల వార్తా ప్రసారాలతో మొదలైన ఎన్టీవీ ఎప్పటికప్పుడు ఫాస్ట్ గా, నిజమైన వార్తలను మాత్రమే ప్రసారం చేస్తూ టీవీ9 ఊకదంపుడు ఉపన్యాసాలకు విరుగుడుగా మంచి కంటెంట్ తో దూసుకుపోయింది. ఛానెల్ మొదలు పెట్టిన నాటి నుంచే ప్రేక్షకుల ఆదరణ పొందుతూ వచ్చింది. గ్రామం నుంచి పట్టణం వరకు ఖచ్చితమైన వార్తలు అంటే ఎన్టీవీ అనేంతగా ప్రజాదరణ పొందింది.
బ్రేకింగ్ న్యూస్ ను ఎప్పుడూ లైవ్ లో ఉండి రిపోర్ట్ చేయడం, ఖచ్చితమైన సర్వేలకు ఎన్టీవీ పెట్టింది పేరు. వార్తలంటే కేవలం తప్పుడు ప్రచారాలు, అనవసరమైన సంచనాలు కాదు, నిజాన్ని ధైర్యంగా చెప్పగలగడం, ప్రజలకు అవసరమైన విషయాల్ని వారి దగ్గరకు చేర్చడమే అని నమ్మిన ఎన్టీవీకి ప్రజలు నెం.1 స్థానాన్ని కట్టబెట్టారు.
గత కొంత కాలంగా బార్క్ రేటింగ్స్ ఆపేసిన విషయం తెలిసిందే. రేటింగ్స్ ఆపేయక ముందు కూడా ఎన్టీవీ నెం.1 స్థానంలోనే ఉండేది. తాజాగా వెల్లడైన బార్క్ రేటింగ్స్ ప్రకారం ఎన్టీవీ 73.8 టీఆర్పీ లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ”ప్రతి క్షణం-ప్రజా హితం” అనే స్లోగన్ ను పెట్టుకుని, కేవలం దాన్ని స్లోగన్ గా వదిలేయకుండా ప్రతిక్షణం ఆ మాట మీద ఉండటమే ఎన్టీవీ ఈ స్థానానికి రావడానికి కారణం. దేనికీ బెదరకుండా, ఎవర్నీ బెదిరించకుండా ప్రజల పక్షాన నిలబడుతుండటమే ఎన్టీవీని తెలుగు మీడియా రంగంలో మేటిగా నిలబెడుతుందని ఆ సంస్థ ప్రకటించింది.
ఇన్నాళ్లు నంబర్ 1గా కొనసాగిన టీవీ9కు ఈ పరిణామం షాకిచ్చినట్టే. ఎందుకంటే ఆ చానెల్ నుంచి రవిప్రకాష్ ను కేసులతో బయటకు పంపాక..చాలా మంది జర్నలిస్టులు వైదొలిగారు. ఇటీవల మురళీ కూడా బయటకు వచ్చాడు. సో రానురాను వివాదాలతో చానెల్ ప్రతిష్టే కాదు.. రేటింగ్ కూడా తగ్గిపోవడం విశేషం.
కాగా, ఎన్టీవీ నెం.1గా నిలవడంపై ఎన్టీవీ, రచనా గ్రూప్ సంస్థల చైర్మన్ తుమ్మల నరేంద్ర చౌదరి, మేనేజింగ్ డైరక్టర్ రమాదేవి సంతోషం వ్యక్తం చేస్తూ, ఎన్టీవీని నెం.1 గా నిలపడంలో భాగమైన ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఇదే స్పూర్తితో ముందు ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని, ”ప్రతి క్షణం- ప్రజా హితం” అనే తమ స్లోగన్ ను మనసులో పెట్టుకుని సేవ చేయాలని సిబ్బందికి సూచిస్తూ, ప్రజలు ఇచ్చిన ఈ గౌరవం తమపై మరింత బాధ్యతను పెంచిందని, ఈ గౌరవాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
