RK vs Vijayashanthi : ఆంధ్రజ్యోతి ఆర్కే కు రాములమ్మ గట్టి కౌంటర్: వరుస ట్వీట్ల దెబ్బకు మైండ్ బ్లాంక్ అయి ఉంటుంది

కవితను అరెస్టు చేయకపోతే ఈ కథనం నిజం అని ఆర్కే చెప్పుకొచ్చారు. బహుశా ఆయన టార్గెట్ కవితను కూడా వదిలిపెట్టకూడదని..అందుకే ఇలా రాశారని అభిప్రాయం కలుగుతోంది..

Written By: Bhaskar, Updated On : June 8, 2023 1:38 pm
Follow us on

RK vs Vijayashanthi : ” ఉత్తరాదిలో అరవింద్ కేజ్రీవాల్ అంతకంతకు ఎదిగిపోతున్నాడు. అతడిని కట్టడి చేసేందుకు కేంద్రం పెద్ద ప్లాన్ వేసింది. త్వరలో అతడిని అరెస్టు చేయబోతోంది. ఇక ఇదే ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ను కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్టు చేయకపోవచ్చు. వైయస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని కూడా కటకటాల వెనక్కి పంపియకపోవచ్చు. ఎందుకంటే బీ ఆర్ ఎస్, వైఎస్ ఆర్ సీపీతో భారతీయ జనతా పార్టీ కి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఇలా చేస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పుట్టి మునగడం ఖాయం” ఇవీ మొన్న కొత్త పలుకులో “ఆంధ్రజ్యోతి” ఎండీ వేమూరి రాధాకృష్ణ రాస్కొచ్చిన మాటలు. వీటికి బండి సంజయ్ నుంచి ధర్మపురి అరవింద్ వరకు ఎవరూ సరైన కౌంటర్ ఇవ్వలేదు. ఫలితంగా ఇది నిజమే అనే భావన ప్రజల్లోకి వెళ్లిపోయింది.. ఇదంతా జరుగుతుండగానే ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తం కాశి పర్యటనలో ఉన్న విజయశాంతి.. ఆర్కే రాసిన వ్యాఖ్యల పట్ల స్పందించారు. ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేసి ఆర్కే ను కడిగిపారేశారు.

అలా ఎలా రాస్తారు

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకులో వ్యాఖ్యలపట్ల విజయశాంతి వరుస ట్వీట్లతో కడిగిపారేశారు. అలా ఎలా రాస్తారు అంటూ ప్రశ్నించారు. ” కవిత అరెస్టు అయితేనే తెలంగాణలో బిజెపికి అధికారం దక్కుతున్నట్టుగానూ.. అలా జరగకపోతే రాష్ట్రంలో కమల దళానికి నిరాశే నన్నట్టుగానూ వెలువడిన ఆ కథనం, దీని ఆధారంగా ఛానల్లో చేపట్టిన చర్చ పూర్తిగా గాడి తప్పిన విషయంగా చెప్పుకోవాలి. పైగా ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని, తెలంగాణలో కవితను అరెస్టు చేయకుండా ఉండడానికి బిజెపి అంగీకరిస్తే.. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ అరెస్టుకు మార్గం సుగమం చేసేలా అరబిందో ఫార్మా శరత్ చంద్ర రెడ్డి అప్రూవల్ గా మారడానికి ఒప్పించడంలో పాత్ర పోషించేందుకు ఏపీ సీఎం కేంద్ర పెద్దలకు హామీ ఇచ్చినట్టుగా నడిచిన ఈ కథనం పూర్తి హాస్యాస్పదం కాక మరొకటి కాదు. ఉత్తరాదిలో ఎదిగిపోతున్న అరవింద్ ను కట్టడి చేసేందుకే బిజెపి ఇదంతా చేస్తోంది అనడం కూడా అపరిపక్వత. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో మొత్తం ఎంపీ స్థానాలు ఎన్నో తెలుసుకుంటే మంచిది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పోల్చితే ఆ సంఖ్య ఎంత? కేవలం కొద్దిపాటి ఎంపీల కోసమే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వ్యూహం నడుస్తోందని సూత్రీకరించడం సరైనదేనా? సమకాలీన రాజకీయాల గురించి ఏ కాస్త తెలిసిన వారి కైనా ఆ విశ్లేషణ స్థాయి ఏంటి అనేది బాగా స్పష్టమవుతుంది” అని విజయశాంతి వరుస ట్వీట్లతో ఎటువంటి పేరు ప్రస్తావించకుండా రాధాకృష్ణ మీద విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంలో విజయశాంతి ఈ స్థాయిలో ఫైర్ అవడం దాదాపు ఇదే తొలిసారి.

శరత్ అప్రూవర్ గా మారితే.. ఏంటి ఫాయిదా?

విజయశాంతి సంధించిన వరస ట్వీట్ల ప్రకారం ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు సంపాదకీయాన్ని ఒక్కసారి పరిశీలిస్తే .. కొరుకుడు పడని అంశాలు చాలానే ఉన్నాయి. శరత్ అప్రూవర్ అయితే కవిత ఎలా సేఫ్ అవుతుందో రాధాకృష్ణ తన కొత్త పలుకు వ్యాసంలో వివరించలేకపోయారు. ఢిల్లీ లిక్కర్ స్కాం అనేది వ్యవస్థీకృత నేరం. ఈ దేశంలో ఇంతవరకు జరిగిన వ్యవస్థీకృత నేరాలను ఏ దర్యాప్తు సంస్థ కూడా నిరూపించలేకపోయింది. ఎట్లాగూ రాజకీయంగా అవసరం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ కేసులో మొదట కవితను టార్గెట్ చేసింది. అసలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ మొదలు పెట్టక ముందే బిజెపి సోషల్ మీడియా కవితను లిక్కర్ క్వీన్ గా ప్రమోట్ చేసింది. కుంభకోణంలో ఆమె ఏం చేసిందో తనకున్న ఆధారాలతో బయటపెట్టింది. శరత్ చంద్రారెడ్డిని కూడా ట్రెండింగ్లోకి తీసుకొచ్చింది. ఈలోగా దర్యాప్తు సంస్థల అధికారులు విచారణ మొదలుపెట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను విచారించారు. ఇంత జరుగుతుంటే కవిత ఎలా సేఫ్ అవుతుందో ఆర్కే చెప్పలేకపోయారు. ఇప్పటికే కవిత గురించి అనేక ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఇది జరుగుతుండగానే ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్ వరుసలేఖలు రాస్తున్నాడు. పేరు, ఊరు లేని కంపెనీల గురించి వివరిస్తున్నాడు.. ఇప్పటివరకు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు చూపిన వివరాలల్లో అరవింద్ మీద కంటే కవిత మీదనే ఎక్కువగా ఉన్నాయి. ఆర్కే చెప్పినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ను మాత్రమే టార్గెట్ చేస్తే కేసు వీక్ అవుతుంది.. ఎన్నికల ముందు ప్రతిపక్షాలకు ఒక బలమైన ఆయుధం లభించినట్టు అవుతుంది.

కథనం నిజమవుతుందని ట్విస్ట్

కవితను అరెస్టు చేయకపోతే ఈ కథనం నిజం అని ఆర్కే చెప్పుకొచ్చారు. బహుశా ఆయన టార్గెట్ కవితను కూడా వదిలిపెట్టకూడదని..అందుకే ఇలా రాశారని అభిప్రాయం కలుగుతోంది.. ఢిల్లీ లిక్కర్ స్కాం మీద మాత్రమే కాకుండా న్యాయవ్యవస్థపై ఏబీఎన్ ఛానల్ లో మాట్లాడిన వారి మాటలపై న్యాయమూర్తి వ్యక్తం చేసిన ఆగ్రహంపై రాధాకృష్ణ స్పందించారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన న్యాయ వ్యవస్థపై అనుమానాలు ఎందుకు వస్తున్నాయో సూటిగా చెప్పేశారు. బెయిల్ విచారణలో కేసు మెరిట్స్ లోకి వెళ్లి వ్యాఖ్యలు చేయడం, అవినాష్ బెయిల్ పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పట్టించుకోకపోవడం వంటి వాటిని నేరుగానే ప్రస్తావించారు. న్యాయవ్యవస్థ పనితీరును గట్టిగానే ప్రశ్నించారు.. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవిత సేఫ్ అంటూ పరోక్షంగా అరెస్టు చేయాల్సిందే అనే సంకేతాలు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులకు, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఇచ్చారు. అయితే ఆర్కే వ్యాసం పై బిజెపి నాయకులు పెద్దగా స్పందించలేదు. కానీ యాదృచ్ఛికంగా ఈ విషయం మీద విజయశాంతి కలగజేసుకున్నారు. నేరుగా పేరు ప్రస్తావించకుండా ఆర్కే కు గట్టి కౌంటర్ ఇచ్చారు. మరి దీనిపై రాధాకృష్ణ ఎలాంటి సమాధానం ఇస్తారో వచ్చే వారం కొత్త పలుకు ప్రచురితమయ్యేంతవరకూ వేచి చూడాల్సిందే.