Raj Pakala’s Escape: జన్వాడ ఫాంహౌస్ కేసు ఇప్పుడు మరింత సీరియస్‌గా మారినట్లుగా తెలుస్తోంది. నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫాంహౌస్ పార్టీ ఇష్యూ.. చివరకు నోటీసుల వరకూ వెళ్లింది. నిన్నటి నుంచి బీఆర్ఎస్ నేతలు ఈ వివాదంపై స్పందిస్తూనే ఉన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ వివాదం కాస్త మరింత సీరియస్ అయింది. దీనికి కారణమూ లేకపోలేదు. జన్వాడ ఫాంహౌస్ లిక్కర్ పార్టీ వ్యవహారంలో ఇరుక్కున్న రాజ్ పాకాల పారిపోవడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఆయన పారిపోవడంతో ఈ వివాదం ఇప్పుడు మరింత పెద్దదైంది.
రాజ్ పాకాల తన ఫాంహౌస్‌లో నిర్వహించింది చిన్నపాటి లిక్కర్ పార్టీనే అనేది తెలుస్తోంది. కాకుంటే అనుమతి లేకుండా నిర్వహించడాన్ని పోలీసులు తప్పుపట్టారు. ఈ క్రమంలో చిన్నపాటి కేసు నమోదయ్యే అవకాశాలు ఉండేవి. కానీ.. ఇప్పుడు ఫాంహౌస్ ఓనర్, పార్టీ నిర్వహించిన రాజ్ పాకాలనే కనిపించకుండా పోవడంతో సీరియస్‌గా మారిపోయింది. మరోవైపు.. పార్టీలో పాల్గొన్న వారికి చేసిన టెస్టుల్లోనూ ఒకరికి కొకైన్ పాజిటివ్‌గా తేలింది. తనకు రాజ్ పాకాలనే ఆ కొకైన్ ఇచ్చినట్లుగా సదరు వ్యక్తి చెప్పాడు. దీంతో ఈ వివాదం కాస్త డ్రగ్స్ వైపునకు దారితీసింది. ఆ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా డ్రగ్స్ వాడినట్లుగా ప్రచారం ఉంది. అయితే ఈ పార్టీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం పాల్గొన్నట్లుగా నిన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. పోలీసులు వచ్చే కాసేపటికే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారని పలువురు ఆరోపించడం కనిపించింది. పార్టీలో నుంచి వెళ్లిపోతున్నట్లు కేటీఆర్‌కు సంబంధించిన వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన పాల్గొన్నది లేనిది ఇప్పటివరకు కూడా ఎలాంటి క్లారిటీ లేదు.
ఇదిలా ఉండగా.. రాజ్ పాకాల కనిపించకుండా పోవడంతో ఎక్సైజ్ పోలీసులు ఓరియన్ విల్లాస్లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాళాలు బద్దలు కొట్టారు. సోదాలకు ప్రయత్నించారు. ఆ తర్వాత నందినగర్‌లోని కేటీఆర్ ఇంటి వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. దాంతో ఈ మందు పార్టీ వ్యవహారం కాస్తా బీఆర్ఎస్‌లో ప్రకంపనలకు దారితీసింది. దీనిని ఎలా సమర్థించుకోవాలో కూడా తెలియక గులాబీ పార్టీ నేతలు సతమతం అవుతున్నారని తెలుస్తున్నది. అయితే.. అది కేవలం కుటుంబ పార్టీనేనని.. కుటుంబాలను రోడ్లపైకి ఎలా లాగుతారని మాత్రం ప్రశ్నిస్తున్నారు. అయితే.. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ట్రిక్సే వాడింది. దాంతో చాలా మందిని జైలులో కూడా పెట్టారు. ఏది ఇస్తే మనకు అది తిరిగి వస్తుంది అని అంటుంటారు. సరిగా ఇప్పుడు బీఆర్ఎస్‌కు ఇదే పరిస్థితి వచ్చిందని టాక్ నడుస్తోంది. ఒకప్పుడు అధికారంలో ఉన్నామనే అహంతో ఎంతో మంది రాజకీయ ప్రత్యర్థుల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టారు. అందుక ఈ వివాదంపై పెద్దగా పార్టీ శ్రేణుల్లో కూడా సపోర్టు రావడం లేదని సమాచారం.