Prashant Kishor vs Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తే ఒక అర్థం ఉంది. కేటీఆర్ విమర్శలు చేస్తే దానికో పరమార్థం ఉంది. హరీష్ రావు ఆరోపణలు చేస్తే దాని వెనుక ఒక కారణం ఉంది. కానీ రేవంత్ మీద ప్రశాంత్ కిషోర్ ఆరోపణలు చేయడం.. తీవ్రస్థాయిలో మండిపడడం.. అన్నిటికంటే మించి ఓడిస్తానని శపదాలు చేయడం నిజంగా తెలంగాణ, బీహార్ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి.
బీహార్ లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ అనే పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ తనకు మాత్రమే సాధ్యమైన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీనికి తోడు జాతీయ న్యూస్ చానల్స్ లో ముఖాముఖిలలో పాల్గొంటున్నారు. తాజాగా ఓ జాతీయ న్యూస్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఆయన మాట్లాడారు.
“బీహార్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీ పోటీ చేస్తోంది. మేము ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించబోతున్నాం. అధికార పార్టీ మీద.. ప్రతిపక్ష పార్టీ మీద బీహార్ ప్రజలు తీవ్ర అగ్రహంతో ఉన్నారు. అటువంటి వారికి మా పార్టీ ఒక ప్రత్యామ్నాయంగా ఉంది. కచ్చితంగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం. బీహార్ రాష్ట్రంపై ఉన్న వలస అనే ముద్రను చెరిపి వేస్తాం. మా వంతు అభివృద్ధిని చేసి చూపిస్తామని” ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు..
ఇంటర్వ్యూ మధ్యలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ప్రస్తావన వచ్చినప్పుడు ప్రశాంత్ కిషోర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.” బీహార్ ప్రజలను రేవంత్ కించపరిచి మాట్లాడారు. తెలంగాణ డిఎన్ఏ, బీహార్ రాష్ట్ర డిఎన్ఏ గురించి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అటువంటి వ్యక్తిని కచ్చితంగా ఓడించాలి. ఆయనను ఓడించడానికి నేను కచ్చితంగా తెలంగాణ వెళ్తాను. ఈ విషయంలో రాహుల్ గాంధీ అడ్డుపడినా ఒప్పుకోను. చివరికి నరేంద్ర మోడీ చెప్పినప్పటికీ వెనుకాడను. బీహార్ ప్రజల అస్తిత్వాన్ని దెబ్బ కొట్టే విధంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి పై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానని” ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను గులాబీ అనుకూల సోషల్ మీడియా గ్రూపులు విపరీతంగా సర్కులేట్ చేస్తున్నాయి. గతంలో ప్రశాంత్ కిషోర్ గులాబీ పార్టీకి పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన సలహాలను గులాబీ పార్టీ పట్టించుకోలేదు. పైగా మల్లన్న సాగర్, ఇతర ప్రాజెక్టులను ప్రశాంత్ కిషోర్ సందర్శించడం అప్పట్లో చర్చకు దారి తీసింది.