Telangana Police : పోలీస్ వర్సెస్ పోలీస్.. క్రమశిక్షణ గల రక్షక భటుల్లో ఈ వింత పరిస్థితికి కారణమేంటి?

కొండాపూర్ 8వ బెటాలియన్ ఎదుట పోలీసు కానిస్టేబుళ్ల ఆందోళన. డిచ్ పల్లి వద్ద రోడ్డుమీదికి వచ్చిన బెటాలియన్ కుటుంబ సభ్యులు. మామునూరులో నిరసన వ్యక్తం చేస్తున్న బెటాలియన్ కానిస్టేబుళ్ల భార్యలు.. ఇవి రెండు రోజులుగా మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్న, వినిపిస్తున్న వార్తలు.

Written By: Neelambaram, Updated On : October 26, 2024 3:01 pm

Telangana Police

Follow us on

Telangana Police :  ఇక శనివారమైతే నల్గొండ జిల్లాలోని అనపర్తి బెటాలియన్ లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం వివాదానికి కారణమైంది. నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబును అరెస్టు చేయాలని కానిస్టేబుల్ నిరసనకు దిగడం సంచలనాన్ని కలిగించింది. “శాంతియుతంగా మేము నిరసన తెలుపుతున్నాం. మా కుటుంబ సభ్యుల మీద అసభ్యకరంగా మాట్లాడారు. నోటికి వచ్చినట్టు తిట్టారు. వెంటనే సైదాబాబును సస్పెండ్ చేయాలని” కానిస్టేబుల్ డిమాండ్ చేశారు. అయితే ఆ సమయంలో సైదాబాబు వద్దకు కానిస్టేబుళ్లు రావడంతో బెటాలియన్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత వారందరినీ అక్కడి నుంచి పంపించారు.. ఇలాంటి సంఘటనలు గత రెండు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో చర్చ మొదలైంది. రాష్ట్రంలోని వివిధ బెటాలియన్లలో పనిచేస్తున్న కానిస్టేబుళ్ల కుటుంబాలు “వి వాంట్ ఏక్ పోలీస్” డిమాండ్ చేస్తున్నాయి. గౌరప్రధమైన పోలీసు ఉద్యోగంలో ఉన్నవారు కూలీలుగా మారుతున్నారని.. వారితో అధికారులు వెట్టిచాకిరి చేస్తున్నారని కానిస్టేబుళ్ల భార్యలు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల, డిచ్ పల్లి, మామునూరు, కొండాపూర్ వంటి ప్రాంతాలలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏక్ స్టేట్ – ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగానే తెలంగాణ రాష్ట్రంలోనూ ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని.. తమ భర్తలకు వెట్టి చాకిరి నుంచి మృతి కల్పించాలని కోరుతున్నారు. వాస్తవానికి పోలీసులుంటే క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటారు. అలాంటి పోలీసులు ఆందోళనకు దిగడం నివ్వెర పరుస్తోంది. పోలీసుల్లో ఎన్నో విభాగాలు ఉంటాయి. అందులో బెటాలియన్ అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ల ఏరివేత లక్ష్యంగా బెటాలియన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అయితే తెలంగాణలో నక్సల్స్ సమస్య తగ్గిపోయిన తర్వాత బెటాలియన్ వ్యవస్థ ఒకప్పటిలాగా చురుకుగా పనిచేయడం లేదు. దీంతో వారిని వివిధ విధుల కోసం ప్రభుత్వం ఉపయోగిస్తోంది. అయితే పోలీసుల్లో మిగతా వారి కంటే ఎక్కువగా బెటాలియన్ విభాగంలో పనిచేసే వారికి జీతభత్యాలు అందేది బహిరంగ రహస్యమే. ఈ బెటాలియన్లో గ్రేహౌండ్స్ అనే విభాగానికి ఎక్కువగా చెల్లింపులు చేస్తారు. వీరికి ప్రత్యేకంగా భత్యాలు లభిస్తాయి.

ఆందోళనకు కారణం ఇదే

అయితే బెటాలియన్ లో పనిచేసే వారిని తరచూ వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పడం.. సరిగ్గా సెలవులు ఇవ్వకపోవడం.. బెటాలియన్ లో జరిగే పనులు కూడా వారి ద్వారా చేయించడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఇటీవల కొన్ని బెటాలియన్ల పరిధిలో చావు డప్పులు కూడా కానిస్టేబుళ్లు చేయడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం తారస్థాయికి చేరింది. అందువల్లేవారు నిరసనకు దిగారు. ఏక్ స్టేట్ ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పోలీసు విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలోనూ అమలు చేయాలని కోరుతున్నారు. అయితే గత కొద్దిరోజులుగా బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపు దాల్చాయి. వీటిని సహజంగానే ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి అనుకూల మీడియా ప్రధానంగా చూపిస్తోంది. దీంతో ఈ సమస్య ఒకసారిగా తీవ్రతను దాల్చుకుంది. మరోవైపు కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళనలను నియంత్రించడానికి ఇతర పోలీసులు రంగంలోకి దిగాల్సి వస్తుంది. ఫలితంగా పోలీసు వర్సెస్ పోలీస్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.. ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కార మార్గంగా ప్రభుత్వం కానిస్టేబుళ్ళ బదిలీలను నిలిపివేసింది. సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని డిజిపి ప్రకటించారు.