Hyderabad : విశ్వనగరం హైదరాబాద్‌కు సమీపంలోని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో దొంగతనం నెపంతో ఓ దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఈ ఘటన తెలంగాణ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. విచారణ పేరుతో రాత్రిపూట మహిళను స్టేషన్‌కు తీసుకెళ్లడమే కాకుండా బట్టలు సైతం విప్పించి ఆమె కొడుకు సమక్షంలోనే విచక్షణారహితంగా కొట్టడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. తన భర్తను మొదట కొట్టి విడిచిపెట్టినట్లు బాధితురాలు తెలిపింది. తర్వాత పోలీసులు తనను స్టేషన్‌కు పిలిపించి చిత్రహింసలు పెట్టారని ఆరోపించింది. కొట్టే ముందు కాళ్లు, చేతులు కట్టేశారని, ఎత్త బతిమిలాడినా విడిచిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతీ స్పందించారు. షాద్‌నగర్‌లోని డీఐ (డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్)పై వచ్చిన ఆరోపణలపై విచారణ పెండింగ్‌లో ఉన్నందున కమిషనరేట్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేసినట్లు తెలిపారు. షాద్‌నగర్ ఏసీపీ దీనిపై విచారణ జరుపుతున్నారని పేర్కొన్నారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
దుమ్మెత్తి పోస్తున్న విపక్ష నేతలు..
షాద్‌నగర్ ఘటనపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. దళిత మహిళపై ఇంత దాష్టీకమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అని ప్రశ్నించారు. దొంగతనం ఒప్పుకోవాలని థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా, కొడుకు ముందే చిత్రహింసలు పెడతారా.. భర్తపైనా దాడిచేస్తారా ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ భయంకరమైన అధికార దుర్వినియోగం సీఎం పర్యవేక్షణలో పోలీసుల క్రూరత్వం యొక్క ఆందోళనకరమైన ధోరణిని ప్రతిబింబిస్తోంది అని హరీశ్‌రావు ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఏం జరిగిందంటే..
జూలై 24న షాద్‌నగర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతుల ఇంటి పక్కన నివాసం ఉంటున్న నాగేందర్ ఇంట్లో దొంగతనం జరిగింది. దీనిపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. అనుమానితులుగా సునీత, భీమయ్యగా పేర్కొన్నాడు. దీంతో పోలీసులు సునీత, భీమయ్య దంపతులతోపాటు వారి 13 ఏళ్ల కుమారుడు జగదీశ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మొదట భీమయ్యను తీవ్రంగా కొట్టారు. తర్వాత సునీతను చిత్రహింసలకు గురిచేశారు. చివరకు మైనర్ బాలుడు జగదీశ్‌ను కూడా చిత్రహింసల గురిచేశారు. డిటెక్టివ్ సీఐ రామిరెడ్డి, అతని సిబ్బంది బాధితురాలు సునీతను కుమారుడి ముందే విచక్షణ రహితంగా కొట్టారు. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని సీఐ రామిరెడ్డి తీవ్రంగా కొట్టడం తో స్పృహ కోల్పోయి పడిపోవడంతో ఇంటికి పంపించారని బాధితురాలు తెలిపింది. 24 తులాల బంగారం, 2 లక్షల నగదుకు కేవలం ఒక తులం బంగారం, నాలుగు వేల నగదు రికవరీ చేశామని పోలీసులు చెబుతున్నారు. నిజంగా దొంగతనం చేస్తే రిమాండ్ తరలించాలి గానీ ఒక దళిత పేద మహిళపై విచక్షణ రహితంగా దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
2023లో ఎల్బీనగర్‌లో..
ఇదిలా ఉంటే.. 2023 ఆగస్టు 15వ తేదీ రాత్రి ఎల్బీనగర్ పోలీసులు మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజే ఈ ఘటన జరిగింది. రోడ్డువెంట నడుచుకుంటూ వెళ్తున్న మహిళను పోలీస్ వాహనంలో ఎక్కించుకుని స్టేసన్‌కు తీసుకెళ్లి తమ ప్రతాపం చూపించారు. రాత్రంతా పోలీస్ స్టేషన్‌లోనే ఉంచుకుని చిత్రహింసలకు గురిచేశారు. ఆమె తన కూతురు పెళ్లికి కావాల్సిన డబ్బుల కోసం ఎల్బీనగర్ నుంచి నాగర్‌కర్నూరల్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా పోలీసులు ఆమెను స్టేషన్‌కు తరలించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. నాడు రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉంది.. సరిగ్గా ఏడాది తర్వాత స్టేషన్ మారింది. కానీ అదే సీన్ రిపీట్ అయింది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మిగతాదంతా సేమ్‌టూ సేమ్..!
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Police charge third degree against dalit woman on pretext of theft in shadnagar police station
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com