Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. అధికార బీఆర్‌ఎస్, విపక్ష కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీతోపాటు మిగతా అన్ని పార్టీలూ ప్రచార వేగం పెంచాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన మొదటి విడత బస్సు యాత్ర పూర్తి చేశారు. తన బస్సు యాత్రలో భాగంగా భూపాలపల్లి, రామగుండం, మంథని, పెద్దపల్లి వంటి సింగరేణి ప్రాంతాలలో తిరిగారు. రామగుండంలో ఆయన సింగరేణి కార్మికులతోనూ సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు గులాబీ బాస్ కేసీఆర్, ఆయన తనయ, ఎమ్మెల్సీ, సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షురాలు కవిత కూడా సింగరేణి కార్మికుల ఓట్లపై దృష్టిపెట్టారు. బీజేపీ కూడా సింగరేణి ఓటర్లకు గాలం వేసేందుకు సిద్ధమవుతోంది.
12 నియోజకవర్గాల్లో ప్రభావం..
సింగరేణి సంస్థ తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ. ఇందులో దాదాపు 42 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇంటికో మూడు కోట్లు లెక్క వేసుకున్నా లక్షకుపైగా ఓటర్లు ఉంటారు. వీరంతా అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తారు. తెలంగాణలో 12 నియోజకవర్గాల్లో అభ్యర్థుల జయాపజయాలను ప్రభావితం చేసేది వారే
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా..
సింగరేణి అని అంతా పిలుచుకునే ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’ ఒక ప్రభుత్వ సంస్థ. బొగ్గు తవ్వి తీసే ఈ సంస్థలో కేంద్రం, రాష్ట్రం రెండూ వాటాదారులే.
కేంద్రం వాటా 49 శాతం ఉంటే తెలంగాణ రాష్ట్రం వాటా 51 శాతం. తెలంగాణలో గోదావరి, ప్రాణహిత లోయ ప్రాంతంలో 350 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ బొగ్గు గనులున్నాయి. ఈ ప్రాంతమంతటినీ కోల్‌బెల్ట్ అంటారు.
ఆరు జిల్లాలు.. 12 నియోజకవర్గాలు..
తెలంగాణలోని ఆరు జిల్లాలు.. కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్, రామగుండం, పెద్దపల్లి, మంథని, భూపాలపల్లి, పినపాక, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాలు కోల్‌బెల్ట్‌లోనే ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాల లెక్కల్లో చూస్తే ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలలోని చాలా ప్రాంతాలలో సింగరేటి ఓటర్ల ప్రభావం ఉంటుంది.
60 వేల మందికిపైగా కార్మికులు..
సింగరేణిలో ప్రస్తుతం సుమారు 42 వేల మంది పర్మినెంట్ కార్మికులున్నారు. వీరితో పాటు 20 వేల మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులు కూడా పనిచేస్తున్నారు. 60 వేల మందికిపైగా పెన్షనర్లున్నారు. ఈ నేపథ్యంలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో సింగరేణి కార్మిక కుటుంబాల ఓట్లు కీలకం.
కార్మికుల భిన్నమైన తీర్పు..
అయితే, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలలో కార్మికులు ఇచ్చే తీర్పు ఆ తరువాత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఇచ్చే తీర్పు అన్ని సందర్భాలలో ఒకేలా ఉండదు. 2017లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగ్గా ఆ ఎన్నికలలో బీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలిచింది.కానీ.. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కోల్‌బెల్ట్ ఏరియాలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో సగం కాంగ్రెస్, సగం బీఆర్‌ఎస్ గెలుచుకున్నాయి. మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, పినపాక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఈ ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, చెన్నూరుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులుగెలిచారు. రామగుండంలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీచేసిన టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి గెలిచారు.
బీఆర్‌ఎస్‌లో చేరిక..
రామగుండం నుంచి గెలిచిన కోరుకంటి చందర్, కాంగ్రెస్ నుంచి గెలిచినవారిలో గండ్ర వెంకటరమణారెడ్డి(భూపాలపల్లి), వనమా వెంకటేశ్వర రావు (కొత్తగూడెం), బానోత్ హరిప్రియ(ఇల్లందు), టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య(సత్తుపల్లి) బీఆర్‌ఎస్‌లో చేరారు. 2019 లోక్ సభ ఎన్నికలు నాటికి సింగరేణి ప్రాంత లోక్‌సభ నియోజకవర్గాలైన ఆదిలాబాద్‌లో బీజేపీ గెలవగా.. మిగతా నాలుగు పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాలను బీఆర్‌ఎస్ గెలుచుకుంది. కోల్ బెల్ట్‌లో కాంగ్రెస్ ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలవలేదు.
కార్మిక కుటుంబాలకు అన్ని పార్టీల గాలం..
రానున్న అసెంబ్లీ ఎన్నికలలో సింగరేణి కార్మికుల కుటుంబాల ఓట్ల కోసం అన్ని పార్టీలూ ప్రయత్నాలు చేస్తున్నాయి. సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులతో పాటు పెన్షనర్ల కుటుంబాల ఓట్లూ ఇక్కడి నియోజకవర్గాలలో గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. అందుకే అన్ని పార్టీలూ వారి సమస్యలపై మాట్లాడుతున్నాయి. తాము అధికారంలోకి వచ్చాకే సింగరేణి కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు కల్పించామని రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ చెప్తుండగా సింగరేణి సంస్థను కాపాడింది, వారికి మేలు చేసింది కేంద్రమేనని బీజేపీ నేతలు అంటున్నారు. అంతేకాదు.. సింగరేణి కార్మికుల చిరకాల డిమాండ్ అయిన ఆదాయ పన్ను మినహాయింపు కూడా సాధ్యం చేయిస్తానని బీజేపీ మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఇన్‌కం ట్యాక్స్ రూపంలో కార్మికుల నుంచి భారీ మొత్తంలో కేంద్రం రాబట్టుకుంటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రధాన సమస్యలు ఇవీ..
సింగరేణి కార్మికుల ఓట్లను లక్ష్యంగా చేసుకున్న పార్టీలు, అభ్యర్థులు వారి సమస్యలపై మాట్లాడుతున్నారు. హామీలు ఇస్తున్నారు. అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ అయితే తమ ప్రభుత్వ హయాంలో ఏమేం చేశామో చెప్పుకొస్తున్నారు. మరోవైపు కార్మికులు అధిక పనిగంటలు, యాంత్రీకరణతో తగ్గుతున్న ఉద్యోగావకాశాలు, కాంట్రాక్ట్ నియామకాలు, అవుట్ సోర్సింగ్ వంటి సమస్యలు ప్రస్తావిస్తున్నారు. రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులు కూడా పింఛను విషయంలో తీవ్ర అసంతప్తి వ్యక్తంచేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా వేతన సవరణ అమలు కాకపోవడంతో పాత పింఛన్లే వస్తున్నాయని, కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్(సీఎంపీఎఫ్)లో సమస్యలున్నాయని రిటైర్డ్ కార్మికులు చెప్తున్నారు.
నెరవేరని సీఎం హామీలు..
సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదన్న అభిప్రాయం కార్మికుల్లో ఉంది. ‘ఒక్క రోజు సర్వీస్ మిగిలి ఉన్నవారిని కూడా కారుణ్య నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటామన్నారు, అది అమలు కాలేదు. పేర్లు తేడా ఉన్నవారికి అసలు పేర్లతో క్రమబద్ధీకరిస్తామన్నారు.. అది కూడా చేయలేదు.’ కొత్తగా భూగర్భ గనులు ఏర్పాటుచేసి లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామన్నారు కానీ ఈ పదేళ్ల కాలంలో కొత్త గని ఒక్కటి కూడా రాలేదు. సింగరేణి కార్మికులకు ఇన్‌కమ్ ట్యాక్స్(ఐటీ) రద్దు చేయిస్తానని కేసీఆర్ పలుమార్లు కార్మికులకు హామీ ఇచ్చారు. కేంద్రం పరిధిలోని విషయమే అయినప్పటికీ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు దిశగా కేసీఆర్ ఎన్నడూ కృషి చేయలేదు. ఆ పార్టీ ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించిన సందర్భాలూ లేవు.
ప్రైవేటీకరణ ప్రభావం..
ఈ ఎన్నికల్లో ప్రైవేటీకరణ ప్రభావం కచ్చితంగా ప్రభావం చూపుతుందంటున్నారు. ప్రైవేటీకరణ పాపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ దోషులే అన్న అభిప్రాయం కార్మికుల్లో ఉంది. మరోవైపు ఇటీవల సింరేణి ఏరియాల్లో పర్యటించిన రాహుల్‌గాంధీ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని, బొగ్గుగనులను సింగరేణికే కేటాయిస్తామని కార్మికులకు హామీ ఇచ్చారు. దీంతో గత ఎన్నికల్లో ఇన్‌కం ట్యాక్స్ ప్రభావం చూపగా, ఈ ఎన్నికల్లో ప్రైవేటీకరణ అంశమే కీలకమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా ఈసారి నల్ల సూరీలు ఎటువైపు మొగ్గుతారో చూడాలి.