Telangana By Elections
Telangana By Elections: తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు షాక్ ఇచ్చారు. కేవలం 39 స్థానాలకే పరిమితం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దీంతో 64 స్థానాలతో హస్తం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు అధికారం కోల్పోవడంతో నిరాశలో ఉన్నారు. ఈ తరుణంలో గులాబీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది అంటూ తరచూ వ్యాఖ్యానించడం, కేసీఆరే తెలంగాణకు మళ్లీ సీఎం అవుతారని ప్రచారం చేయడంతో సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ గేట్లు తెరిచారు. అప్పటికే హస్తంవైపు చూస్తున్న దానం నాగేందర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత మరో 9 మంది కూడా దానం బాటలో నడిచారు. దానం నాగేందర్ అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోలీ చేసి ఓడిపోయారు.
స్పీకర్‌కు ఫిర్యాదు..
బీఆర్‌ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గులాబీ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను ఆదేశించింది. అయినా స్పీకర్ అనర్హతపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బీఆర్‌ఎస్ నేతలు ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
10వ తేదీ వరకు గడువు..
సుప్రీం కోర్టు పదో తేదీ వరకు సమాధానం చెప్పాలని స్పీకర్‌కు సూచించింది. అంటే గడువు ఇంకా వారం రోజులే ఉంది. ఈరోజు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు కేరళ హైకోర్టు కూడా పార్టీ ఫిరాయింపులపై స్పందించింది. పార్టీ మారాలనుకునేవారు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పది స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది. మరోవైపు గులాబీ బాస్.. కేసీఆర్ ఇటీవల పార్టీ కార్యకర్తలతో కీలక వ్యాఖ్యలు చేశారు. కొడితే గట్టిగానే కొడతా అనడం.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై త్వరాగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నం కావడంతో ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
ఉప ఎన్నికలు ఖాయమని..
ఇదిలా ఉంటే.. గులాబీ నేతలు తెలంగాణలో పది స్థానాలకు ఉప ఎన్నికలు ఖాయమన్న భావనలో ఉన్నారు. ఈమేకు కేటీఆర్ ఇప్పటికే పదే పదే చెబుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఉప ఎన్నికలు ఖాయమని డిసైడ్ అయ్యారు. అందుకే త్వరలో ప్రజాక్షేత్రంలోకి రావాలని భావిస్తున్నారు. ఈ నేలాఖరులోగా బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పదనన భావనలో గులాబీ నేతలు ఉన్నారు.
రేవంత్ సర్కార్‌కు గడ్డుకాలం..
ఇక జరుగుతన్న పరిణామాలను పరిశీలిస్తే.. రాబోయే రోజుల్లో రేవంత్ సర్కార్‌కు కషఫ్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే 420 హామీలు, ఆరు గ్యారంటీలు నెరవేర్చాలని గులాబీ నేతలు పోరాటం చేస్తున్నారు. సభలు పెడుతూ నిలదీస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఆందోళనలు చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ ఎక్స్‌లో నిర్వహించిన పోల్‌లో కూడా కాంగ్రెస్ పాలన బాగా లేదని 70 శాతం మంది ఓటేశారు. దేశంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న ప్రభుత్వం ఇదే అన్న చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని పొలిటికల్ ఎనలిస్టులు పేర్కొంటున్నారు.