Owaisi College Controversy: ఆక్రమణలు లేని హైదరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేయడానికి హైడ్రా అనే వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ఆరోపణలు, వివాదాలను పక్కన పెడితే హైడ్రా ఇప్పటివరకు చాలా వరకు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది. ఆక్రమణలను పడగొట్టింది. నాలాలను పరిరక్షించింది. చెరువులను కబ్జాల చెర నుంచి కాపాడింది. భవిష్యత్తులో ఇంకా అనేక లక్ష్యాలను నిర్దేశించుకుంది. ప్రస్తుతం హైదరాబాదులో కురుస్తున్న వర్షాలకు మునుగుతున్న లోతట్టు ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
Also Read: భార్య చీపురుతో కొట్టడంతో కమెడియన్ ఆత్మహత్య
హైడ్రా ఇటీవల కాలంలో చేపట్టిన పనులకు సంబంధించి కొంతవరకు ప్రజా మోదం లభించింది. అయితే కొన్ని పనులు మాత్రం ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. అందులో ప్రధానమైనది ఓవైసీకి సంబంధించిన ఫాతిమా కాలేజీ వ్యవహారం. ఫాతిమా కాలేజీని చెరువులో నిర్మించారు. చెరువును ఆక్రమించి.. అందులో మట్టి పోసి ఈ కాలేజీ నిర్మించారు. ఈ కాలేజీలో పేద ముస్లిం యువతులు చదువుకుంటున్నారు. హైడ్రా ఫాతిమా కాలేజీ ని పడగొట్టాలని డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. దీనిపై ఇటీవల హైడ్రా అధిపతి రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. ఫాతిమా కాలేజీలో పెద్ద ముస్లిం విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి మానవత దృక్పథంతో ఆ కాలేజీని పడగొట్టబోమని రంగనాథ్ స్పష్టం చేశారు. రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే ఇప్పుడు భట్టి కూడా రంగనాథ్ మాదిరిగానే వ్యాఖ్యలు చేశారు.
ఉప ముఖ్యమంత్రి హోదాలో విక్రమార్క ఆదివారం ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు..” ఓవైసీ సోదరులకు చెందిన ఫాతిమా కాలేజీలో చాలామంది పేద ముస్లిం విద్యార్థులు చదువుకుంటున్నారు. మానవతా దృక్పథంతో ఆ కాలేజీని అందువల్లే పడగొట్టడం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని చెప్పింది వాస్తవమే. కాకపోతే రెండోసారి జరిగిన మంత్రివర్గ కూర్పులో సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకోవడం వల్ల రాజగోపాల్ రెడ్డికి అన్యాయం జరిగింది. అయితే ఆయనకు అధిష్టానం ఎలా న్యాయం చేస్తుంది అనేది చూడాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులను దృష్టిలో పెట్టుకొని 10 సంవత్సరాల వరకు తానే ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ వ్యాఖ్యానించి ఉండవచ్చు. రేవంత్ తీసిన వ్యాఖ్యలపై నేను ఎటువంటి మాటలు మాట్లాడలేనని” విక్రమార్క పేర్కొన్నారు
Also Read: ఇందిరమ్మ లబ్ధిదారులకు మరో శుభవార్త..
ఫాతిమా కాలేజీ వ్యవహారంపై ప్రభుత్వ మరోసారి తన స్పష్టమైన వైఖరి ప్రదర్శించిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాలలో విమర్శలు ఎదురవుతున్నాయి. పేదల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించిన హైడ్రా.. ఓవైసీ సోదరులకు మాత్రం మోకారిల్లుతోందని అటు బిజెపి.. భారత రాష్ట్ర సమితి నాయకులు ఆరోపిస్తున్నారు. ఓవైసీ రాజకీయంగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే తెరపైకి మానవత దృక్పథం అనే మాట మాట్లాడుతున్నారని బిజెపి, గులాబీ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు.