
TSPSC Paper Leak: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న టీఎ్‌స పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంపై ప్రతిపక్షాల పోరు మరింత ఉధృత రూపు దాల్చనుంది. రాష్ట్రంలోని విపక్షాలన్నీ కలిసి సర్కారుపై ఒక్కుమ్మడిగా దాడి చేయనున్నాయి. సీబీఐ లేదా సిటింగ్ జడ్జి విచారణకు, కేటీఆర్ రాజీనామాకు మరింత తీవ్రంగా డిమాండ్ చేసే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, వైటీపీ వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నాయి. ప్రభుత్వంపై, బీఆర్‌ఎస్ నేతలపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. లీకేజీపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని బీజేపీ పదాధికారుల సమావేశంలోనూ నిర్ణయించారు. తాజాగా, పేపర్ లీకేజీ, నిరుద్యోగుల సమస్యలపై ఉమ్మడి పోరాటం చేద్దామంటూ రేవంత్, సంజయ్‌లకు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రతిపాదించారు. ఆమె పిలుపునకు ఎవరు ఎలా స్పందిస్తారనే విషయాన్ని పక్కనబెడితే.. లీకేజీ, నిరుద్యోగుల సమస్యలపై యుద్ధాన్ని ముమ్మరం చేసేందుకే ప్రతిపక్షాలు కంకణం కట్టుకున్నాయనే విషయం స్పష్టమవుతోంది.
షర్మిల పిలుపు నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన బండి సంజయ్.. పార్టీ పెద్దలతో మాట్లాడి చెబుతానన్నారు. ‘‘షర్మిల నాకు ఫోన్ చేసిన మాట వాస్తవమే. కేసీఆర్ అరాచకాలతో భవిష్యత్తులో ఎవరికి అన్యాయం జరిగినా పోరాటం చేస్తామని చెప్పా. అయితే, కాంగ్రె్‌సతో కలిసి పనిచేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని’ వివరించారు. అయితే టీఎస్ పీఎస్‌సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో తగ్గకూడదని బీజేపీ పెద్దలు చెప్పిన నేపథ్యంలో సంజయ్ ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

మరో వైపు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా షర్మిల పిలుపునకు సానుకూలంగా స్పందించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడిగా సర్కారు పై పోరాటం చేసేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని రేవంతర్‌రెడ్డి అన్నట్టు తెలుస్తోంది. ఇదే తీరుగా బీఎస్పీ, కోదండరాం, ఓయూ జేఏసీల, విద్యార్థి సంఘాలను కూడా షర్మిలఫోన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే వారంతా కూడా సర్కార్ పై జంగ్ సైరన్ విన్పించేందుకు తాము కూడా సిద్ధం అన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. అయితే ఏ రూపంలో సర్కారుపై ఉద్యమం చేస్తారు? ఎలాంటి పద్ధతులు ఎంచుకుంటారనేది? తెలియాల్సి ఉంది. మొత్తానికి టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ ప్రతిపక్షాలను ఏకం చేసినట్టు కన్పిస్తోంది.