Hyderabad : విలాసవంతమైన ఇంట్లో ఉండాలి. అద్భుతమైన కారులో తిరగాలి. లైఫ్ మొత్తం లగ్జరీగా జీవించాలి. వేసుకునే షూ నుంచి పెట్టుకునే వాచి వరకు ప్రతి దాంట్లో హై ఎండ్ మైంటైన్ చేయాలి.. ఇవన్నీ జరగాలంటే డబ్బులు కావాలి. చేసే ఉద్యోగం వల్ల వచ్చే డబ్బుతో ఇవి జరగవు. అవన్నీ నెరవేరాలంటే అదనపు ఆదాయం కావాలి. అలాంటి ఆదాయం కోసం వేసే అడుగులే చాలామంది జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఐటి ఉద్యోగుల జీవితాలను హై ఎండ్ ఆలోచనలు నాశనం చేస్తున్నాయి.
భారీగా సంపాదించాలని.
వస్తున్న జీతానికంటే ఇతర మార్గాల ద్వారా ఎక్కువగా సంపాదించాలని చాలామంది భావిస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లలో ఈ ఆలోచన ఎక్కువగా ఉంది. అందువల్లేవారు బెట్టింగ్, ఆన్ లైన్ ట్రేడింగ్ వంటి వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. అప్పులు తీసుకొచ్చి అందులో భారీగా పెట్టుబడులు పెట్టి.. ఆ తర్వాత వాటిని తీర్చలేక నిండా మునిగిపోతున్నారు. చివరికి తమ జీవితాలకు ఎండ్ కార్డు వేసుకుంటున్నారు. అలాంటి విషాదమే ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ది. హైదరాబాదులోని గాజుల రామారం ప్రాంతంలో మంచిర్యాలకు చెందిన ఇప్ప వెంకటేష్ (40), భార్య వర్షిణి(33), కుమారుడు రిషికాంత్ (11), విహాంత్ (3) ఉన్నారు. వెంకటేష్ కోకాపేటలోని లెగోట్ అనే కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇతడు అధికంగా సంపాదించాలి అనే ఆశతో ఆన్ లైన్ బెట్టింగ్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కు బానిసయ్యాడు. ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొచ్చాడు. ఆన్ లైన్ యాప్ లలోనూ రుణాలు తీసుకున్నాడు. ఇలా ఏకంగా 25 లక్షల అప్పుల్లో కురుకుపోయాడు. అప్పులు పేరుకుపోవడం, కుటుంబాన్ని పోషించే దారి లేకపోవడంతో ఒక్కసారిగా కృంగిపోయాడు. జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తనతో పాటు భార్య పిల్లలు కూడా హత్య చేసి.. అతడు సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు.
తండ్రి ఫోన్ కు మెసేజ్
అప్పుల బాధ తట్టుకోలేక తాము మొత్తం చనిపోతున్నామని తన తండ్రి ఫోన్ కు మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ ను ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల 30 నిమిషాలకు వెంకటేష్ తండ్రి చూశాడు. వెంటనే తన కుమారుడు నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ వాచ్ మెన్ కు ఫోన్ చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో చుట్టుపక్కల వారు తలుపులు పగలగొట్టి చూస్తే.. వెంకటేష్ కుటుంబ సభ్యులు మొత్తం చనిపోయి కనిపించారు.. వెంకటేష్ తన కుటుంబ సభ్యులను ఎలా చంపాడనేది తెలియకుండా ఉంది. అయితే పోస్టుమార్టం నిర్వహిస్తే పూర్తి విషయాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు.