PAK vs BAN : గెలవాల్సిన తొలి టెస్ట్ బంగ్లాదేశ్ కు సమర్పించుకుంది. 10 వికెట్ల తేడాతో ఓడిపోయి పరువు పోగొట్టుకుంది. టెస్ట్ ర్యాంకింగ్స్ లో మరింత దిగజారింది. ఆ ఓటమి తర్వాత కెప్టెన్, మరో ఆటగాడు కొట్టుకున్నారు. దీన్ని ఆపడానికి వచ్చిన మరో ఆటగాడిని కూడా కొట్టారు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.. సరే ఇవన్నీ సర్వసాధారణం అనుకుంటే.. రెండవ టెస్టు లోనూ ఓడిపోయే పరిస్థితి దాపురించింది. ఇంతకీ ఈ ఉపోద్ఘాతం ఏ జట్టు గురించో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతటి దారుణమైన క్రికెట్ ప్రపంచంలో పాకిస్తాన్ తప్ప మరొక జట్టు ఆడ లేదంటే అతిశయోక్తి కాదు.
బంగ్లాదేశ్ తో తొలి టెస్ట్ ను 10 వికెట్ల తేడాతో కోల్పోయిన పాకిస్తాన్.. రెండవ టెస్టులోనూ అదే దరిద్రమైన ఆట తీరును ప్రదర్శిస్తున్నది. మొదటి టెస్ట్ రావల్పిండిలో జరగగా.. రెండవ టెస్ట్ కరాచీలో నిర్వహిద్దామని భావించారు. కానీ కరాచీ మైదానాన్ని ఛాంపియన్స్ ట్రోఫీ కి సిద్ధం చేస్తున్న నేపథ్యంలో.. రెండవ టెస్ట్ కూడా రావల్పిండిలో నిర్వహిస్తున్నారు. కొద్దిరోజులుగా అక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండవ టెస్ట్ తొలి రోజు ఆట కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ వైపు మొగ్గు చూపించింది. తొలి ఇన్నింగ్స్ లో 274 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆయుబ్ 58, మసూద్ 57, ఆఘా సల్మాన్ 54, బాబర్ అజామ్ 31, రిజ్వాన్ 29.. ఆకట్టుకున్నారు. మిగతావారు విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో మిరాజ్ 5, అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టారు. షకీల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
బంగ్లా 262 పరుగులకు ఆలౌట్
ఇక మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 262 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో లిటన్ దాస్ 138 రన్స్ చేసి సత్తా చాటాడు. మిరాజ్ 78 రన్స్ చేసి అదరగొట్టాడు. ఇక మిగతా ఆటగాళ్లు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. 26 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ జట్టును మిరాజ్, దాస్ ఆదుకున్నారు. వీరిద్దరూ 165 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు.. లిటన్ దాస్ చివరి వరకు ఉండడంతో బంగ్లా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
ఇలాంటి గల్లి ప్రదర్శనతో ఎలా గెలుస్తార్రా
ఇక రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు కడపటి వార్తలందే సమయానికి 83 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది.. ఓపెనర్ అబ్దుల్ షఫీక్ 3 మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. మరో ఓపెనర్ ఆయుబ్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.. షాజాద్ గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు.. కెప్టెన్ షాన్ మసూద్ 28 పరుగులు చేసి నహీద్ రానా బౌలింగ్లో ఔట్ అయ్యాడు. బాబర్ ఆజాం 11, షకీల్ 2 పరుగులకే పెవిలియన్ చేరుకున్నారు. ప్రస్తుతం క్రీజ్ లో రిజ్వాన్ 11, సల్మాన్ 0 ఉన్నారు.. బంగ్లా పై పాకిస్తాన్ ప్రస్తుతానికి 95 పరుగుల లీడ్ లో ఉంది. బంగ్లా బౌలర్లలో రాణా మూడు, మహమూద్ 2 వికెట్లు పడగొట్టారు. అహ్మద్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. బంగ్లా బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేస్తున్న నేపథ్యంలో.. పాకిస్తాన్ బ్యాటర్లు ఎంత మేరకు మైదానంలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు కీలక ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ కావడంతో పాకిస్థాన్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ” సొంత దేశంలో.. ఇలాంటి గల్లి ప్రదర్శనతో ఎలా గెలుస్తార్రా” అంటూ విమర్శలు చేస్తున్నారు.