Half Day Schools: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగ్గుమంటున్నాడు. మార్చి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణ విద్యాశాఖ విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శుక్రవారం(మార్చి 15) నుంచి హాఫ్ డే స్కూల్స్ ప్రారంభమయ్యాయి.
పాఠశాల వేళలు ఇవీ..
ఇక హాఫ్ డే సందర్భంగా పాఠశాలలను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించాలో విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని సూచించింది. 12:30 గంటలకు మధ్యాహ్నం భోజనం పెట్టి ఇళ్లకు పంపించాలని పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది.
నిబంధనలు ఉల్లంఘిస్తే..
తెలంగాణలో ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాలలను ఒంటిపూట నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. ప్రబుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు తప్పకుండా ఒంటిపూట బడులు అమలు చేయాలని ఆదేశించారు. లేనిపక్షంలో అన్నిరకాల చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పరీక్ష కేంద్రాలు ఉంటే..
ఇక ఈనెల 18 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు హాఫ్ డే స్కూల్స్ నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొనంది.