https://oktelugu.com/

Nirmal: చీకటి పడితే ఆ ఊళ్లో చిచ్చే… తగలబడతున్న వాహనాలు.. చివరకు సీసీ కెమెరా చూసి పోలీసుల షాక్

నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలం రాజాపూర్‌ గ్రామంలో కొన్ని రోజులుగా ఇళ్ల ముందు నిలిపిన వాహనాలు తెల్లవారే సరికి కాలిపోతున్నాయి. పదుల సంఖ్యలై బైక్‌కు కాలి బూడిదయ్యాయి. బైక్‌కు ఎందుకు తగలబడుతున్నాయో తెలియక గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 15, 2024 / 11:49 AM IST

    Nirmal

    Follow us on

    Nirmal: అదో చిన్న పల్లెటూరు. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉంది. వ్యవసాయ ఆధారిత గ్రామం కావడంతో పొద్దంతా ఎవరి పని వాళ్లు చేసుకుని చీకటి పడగానే నిద్రలోకి జారుకుంటారు. గ్రామం కావడంతో అర్ధరాత్రి వరకు ఎవరూ మేల్కొని ఉండరు. ఇలా ప్రశాంతంగా రోజులు సాగిపోతుండగా కొన్ని రోజులుగా అనుకోని ఘటనలు ఆ గ్రామస్తులను కలవర పెట్టాయి. తెల్లవారే సరికి గ్రామంలోని వాహనాలు కాలిపోయి ఉంటున్నాయి. ఇలా ఒకటి రెండు కాదు వరుసగా పదుల సంఖ్యలో వాహనాలు కాలిపోయాయి. దీంతో ఆ గ్రామస్తులు నిద్రలేని రాత్రులు గడిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు సీసీ కెమెరా ఏర్పాటు చేయడంతో రహస్యం చిక్కింది.

    నిర్మల్‌ జిల్లాలో..
    నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలం రాజాపూర్‌ గ్రామంలో కొన్ని రోజులుగా ఇళ్ల ముందు నిలిపిన వాహనాలు తెల్లవారే సరికి కాలిపోతున్నాయి. పదుల సంఖ్యలై బైక్‌కు కాలి బూడిదయ్యాయి. బైక్‌కు ఎందుకు తగలబడుతున్నాయో తెలియక గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. కంటిమీద కునుకు లేకుండా గడిపారు. చివరకు రహస్యం తెలియక పోలీసులను కూడా ఆశ్రయించారు. విచారణ జరిపిన పోలీసులకు కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు.

    సీసీ కెమెరా పట్టించింది..
    చివరకు పోలీసులు గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వరుస ఘటనలతో ఆందోళన చెందిన గ్రామస్తులు చివరకు పోలీసుల సూచనతో ఇంటికో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అసలు బాగోతం బయటపడింది. ఓ రోజు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి రోజు లాగానే ఓ ఇంటి ముందుకు వచ్చాడు. పార్కు చేసి ఉన్న బైక్‌కు నిప్పంటించాడు. ఈ దృశ్యం సీసీ కెమెరాలు రికార్డు అయింది.

    గ్రామానికి చెందిన యువకుడు..
    దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామంలోని అన్ని సీసీ కెమెరాలను పరిశీలించారు. దీంతో గుట్టు వీడింది. నిందితుడు అదే గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడని గుర్తించారు. పక్కా ప్లాన్‌ ప్రకారం అర్ధరాత్రి 1 గంట తర్వాత గ్రామంలో తిరుగుతూ ఇళ్ల ముందు పార్‌ చేసి ఉన్న వాహనాలు తగలబెట్టినట్లు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బైక్‌ల దహనం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా.. లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.