NTR Statue: ఖమ్మంలో అసలు పెట్టాల్సిన విగ్రహం ఆ మహానుభావుడు ‘సర్దార్’ దే

ఇవాళ ప్రభావం చూపిస్తున్న ఓ సామాజిక వర్గం ఆయన కీర్తిని తాత్కాలికంగా నిలుపుదల చేయవచ్చుగాక.. తమకున్న అర్థబలంతో ఎటువంటి సంబంధంలేని ఒక వ్యక్తి విగ్రహాన్ని నిలుపుదల చేసేందుకు ప్రయత్నించవచ్చు గాక.

Written By: Bhaskar, Updated On : November 9, 2023 8:43 pm
Follow us on

NTR Statue – Khammam: లకారం చెరువు.. ఖమ్మం నగరానికి ఒకప్పుడు సాగునీరు అందించింది. కబ్జాల వల్ల కృషించిపోయింది.. ఉన్న ఆకొద్ది తాటాకం కూడా ఖమ్మం నగరానికి ఇప్పుడు తాగునీరు అందివ్వని పరిస్థితి నెలకొంది. ఏ కారణం వల్ల తెలియదు కానీ ఆ లకారంలో ఒక బలమైన పునాది పడింది. దీని వెనుక ఒక “కమ్మ”నైన వ్యక్తుల కలయిక ఉందని జగమెరిగిన సత్యమే. ఆ వ్యక్తులు ఒక విగ్రహం ఏర్పాటుకు పూనుకున్నారు. కానీ దాని తయారీ, రూపొందించిన విధానం పట్ల ఒక సామాజిక వర్గం వారి మనో భావాలు దెబ్బతిన్నాయి. పంచాయితీ కోర్టు దాకా వెళ్ళింది. కోర్టు కూడా మంచినీళ్ల చెరువులో విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించింది. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని స్టే ఇచ్చింది. కానీ ఇవాల్టికి ఖమ్మం తో సంబంధం ఉన్నవారందరూ ఈ పరిణామాల్ని చూస్తూ ఆశ్చర్యపోతున్నారు.. ఒక్కసారి చరిత్రను మననం చేసుకుంటే గతం తాలూకు జ్ఞాపకాలు వారికి అసలు వాస్తవాన్ని కళ్ళకు కడుతున్నాయి.

ఇవాళ ఖమ్మం అభివృద్ధి చెందవచ్చు గాక.. గ్రీన్ ఫీల్డ్ హైవే వంటి అధునాతన రహదారులు ఖమ్మం నగరాన్ని మరింత శోభాయ మనంగా చేయవచ్చుగాక.. కానీ వీటన్నింటికీ బీజం వేసింది నాగార్జునసాగర్ ప్రాజెక్టు కెనాల్. ఈ కెనాల్ గనక లేకుంటే ఖమ్మం ఇంత సుభిక్షంగా ఉండేది కాదు. పంటలతో అల్లాడుతూ ఉండేది అంతకన్నా కాదు. ఇదంతా ఒక వ్యక్తి దీర్ఘ దృష్టికి నిదర్శనం. భవిష్యత్తు కాలాన్ని ముందే ఊహించి ముందే ఆ పనులు చేపట్టిన విధానానికి నిలువెత్తు సాక్షాత్కారం.. అతడి ఆలోచన గనుక లేకుండా ఉండి ఉంటే ఇవాళ ఈ స్థితి ఖమ్మానికి వచ్చి ఉండేది కాదు.

నిజానికి ఖమ్మం అనేది ఆంధ్ర సరిహద్దు ప్రాంతం. తెలంగాణ సంస్కృతి మరీ అంత దృఢంగా కనిపించని ప్రాంతం. కానీ ఆ ప్రాంతం నుంచి వచ్చిన ఒక వ్యక్తి రాజకీయాల్లో ఎటువంటి అండదండ లేకుండా అనితర సాధ్యమైన వ్యక్తిగా ఎదిగాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తన కంటిచూపుతో శాసించాడు. అయితే తనకు అన్నం పెట్టిన ఖమ్మాన్ని ఏ దశలోనూ వదులుకునేందుకు ఇష్టపడలేదు. తన నుంచి ఖమ్మాన్ని దూరం పెట్టలేదు. తనకున్న రాజకీయ చతురతతో ఎక్కడో నల్లగొండ జిల్లా నుంచి పారే నాగార్జునసాగర్ జలాలను ఖమ్మం మీదుగా ఆంధ్రకు మళ్ళించాడు. నాడు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కెనాల్ కు సంబంధించి పనిచేసిన ఇంజనీర్లు ముందుగా తమ అలైన్మెంట్లో ఖమ్మం ప్రస్తావన తీసుకురాలేదు. తొండలు గుడ్లు పెట్టే భూమిలో కచ్చితంగా పచ్చని సిరులు పండాలనే ఉద్దేశంతో నాడు ఆ వ్యక్తి నాగార్జునసాగర్ కెనాల్ అలైన్మెంట్ పూర్తిగా మార్చాడు. ఇది నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ పదిమంది కడుపు నింపాలంటే ఒక్కోసారి నిబంధనలకు అవతల వైపు వెళ్లి పని చేయాల్సి ఉంటుంది. ఆయన అప్పుడు ఆ పని చేసాడు కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాకుతున్న జిల్లాల్లో ఖమ్మం ముందు వరసలో నిలబడింది.

కేవలం నాగార్జునసాగర్ కెనాల్ మాత్రమే కాదు కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్, ఐటీసీ పేపర్ బోర్డు, అశ్వాపురం భారజల కర్మాగారం, పాల్వంచ ఎన్ఎండిసి, ఇక్కడే రాగి శుద్ధి పరిశ్రమ ( ఇప్పుడు మూతపడింది), సింగరేణి హెడ్ ఆఫీస్, పాలేరు హైడల్ ప్రాజెక్టు, మత్స్య పరిశోధన సంస్థ, జవహర్ నవోదయ విద్యాలయం… ఇలా చెప్పుకుంటూ పోతే ఖమ్మం అభివృద్ధిలో అతడి పాత్ర అణవణువు ఉంది. పేరుకుపోయిన కుల రాజకీయాల వల్ల సర్ ఆర్ధర్ కాటన్ లాగా గౌరవాలు, పూజలు అందుకోవాల్సిన వాడు ఎక్కడో దూరంగా ఒక జ్ఞాపకం లాగా మిగిలిపోయాడు.

ఇవాళ ప్రభావం చూపిస్తున్న ఓ సామాజిక వర్గం ఆయన కీర్తిని తాత్కాలికంగా నిలుపుదల చేయవచ్చుగాక.. తమకున్న అర్థబలంతో ఎటువంటి సంబంధంలేని ఒక వ్యక్తి విగ్రహాన్ని నిలుపుదల చేసేందుకు ప్రయత్నించవచ్చు గాక.. కానీ సత్యాన్ని చెరి పేస్తే చెరిగిపోదు. అభివృద్ధిని అరచేయి అడ్డంపెట్టి అడ్డుకుంటే అది కనిపించకుండా మాసిపోదు. ఉవ్వెత్తున ఎగిసిపడి వస్తున్న సాగర్ జలాలు, మూడు పంటలకు ఆలవాలమైన మాగాణి భూములు, భారజలం తయారీకి కారణమైన గోదావరి జలాలు ఇలా ప్రతి ఒక్కటి అతని ఆనవాళ్లు చూపిస్తుంటే.. ఏ విగ్రహం మాత్రం అతడి నిగ్రహాన్ని దాచ గలదు.. ఆ రోజుల్లోనే ఖమ్మం అతడికి సర్దార్ అని పేరు పెట్టింది. తమ గుండెల్లో నిలుపుకుంది. ఆ ప్రేమతో పోలిస్తే ఈ విగ్రహం ఏ పాటిది?! అందుకే ప్రకృతి సైతం, సమస్త వ్యవస్థలు సైతం ఆ క్రతవును అడ్డుకున్నాయి. కొన్ని కొన్ని సార్లు మానవులు దారి తప్పినప్పటికీ ఈ సృష్టి వారి బాధ్యతను గుర్తుచేస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఆ బాధ్యతను గుర్తు ఎరిగి ఆ సర్దార్ కు ఖమ్మం నడిబొడ్డున ఒక విగ్రహ వాక్యం లాగా నిగ్రహమైన సంకేతాన్ని చూపిస్తే చాలు!