Indiramma Indlu App : సాంకేతిక రంగం విపరీతంగా పెరిగిపోయింది. చదువుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఇక 5G కూడా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వాలు, ఆయా ఉద్యోగ సంస్థలు వారి వారి పనులను యాప్ ల ద్వారా చేయించుకుంటున్నాయి. ఒక మార్కెటింగ్ ఉద్యోగి ఒక ఊరికి వెళ్లి అక్కడి నుంచి ఒక పావలా పోస్ట్ కార్డుపై కంపెనీ అడ్రస్ రాసి పోస్ట్ చేస్తేనే సదరు ఉద్యోగి మార్కెటింగ్ కోసం ఆ ఊరికి వెళ్లేవాడని కంపెనీ నమ్మేది. ఇప్పడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. సదరు ఊరికి వెళ్లి ఆ షాపు వారి ఫొటో కొట్టి అప్ లోడ్ చేస్తున్నారు. ఇలా చాలా విషయాల్లో మార్పులైతే జరిగాయి. సాంకేతికత పెరగడంతో పనుల్లో కూడా వేగం పెరిగింది. మనిషి ఈ జమానాలో స్వయంగా చేయాల్సిన పని స్విచ్ లను నొక్కడమే. ఈ సాంకేతికతను ప్రైవేట్ సంస్థలు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ మాత్రమే వాడుతుండేవి. కానీ ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా్లు వీటినే ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. చాలా కార్యక్రమాలకు సపరేట్ గా యాప్ లను తయారు చేసి వాటి నుంచి వివరాలు నమోదు చేసి చెక్ చేస్తున్నారు.
ఇటీవల ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇండ్లు’ అనే యాప్ ను తయారు చేసింది. గతంలో ‘ప్రజా పాలన’లో తీసుకున్న అర్జీలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ యాప్ ను ఉపయోగిస్తున్నారు. ప్రజా పాలనలో తీసుకున్న అర్జీల్లో ఇండ్లు లేని వారి వివరాలను పరిశీలించి వారికి ఒక రోజు ముందు ఫోన్ చేసి రోజు తర్వాత వచ్చి ఇందిరమ్మ ఇండ్లు యాప్ లో వివరాలు నమోదు చేసుకుంటారు. ఈ యాప్ నుంచి తీసుకున్న వివరాలు నేరుగా ప్రభుత్వానికి వెళ్తాయి. అక్కడి పెద్దలు పరిశీలించి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.
ఇలా చాలా విషయాలకు ప్రభుత్వాలు సొంతంగా యాప్ లు తయారు చేస్తున్నాయి. ఇలానే తెలంగాణ ప్రభుత్వం ఒక యాప్ ను తీసుకురాబోతోంది. ఈ యాప్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించి చాలా పనులు వేగంగా పూర్తవుతాయి. అంటే మీరు ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే సమీపంలోని కార్యాలయం వెళ్లి చేసుకోవాలి. గంటల గంటల సమయం వృథా.. పనులు కూడా వేగంగా కావడం లేదు. దీంతో ప్రభుత్వం ఒక యాప్ ను తీసుకువస్తుంది.
అయితే ఈ యాప్ ను పంచాయతీ పరిధిలో వినియోగించనున్నారు. జనన, వివాహ, మరణ, ఇంటి నిర్మాణ అనుమతి, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలా చాలా పథకాలు, సర్టిఫికెట్లు మొత్తం 20 రకాలకు సంబంధించి ఈ యాప్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దీని పేరు ‘మై-పంచాయతీ’ అని పెట్టబోతోందట. వీటితో పాటు గ్రామ సమస్యలపై కూడా ఇందులో ఫిర్యాదు చేయవచ్చట. ఇది వస్తే ప్రభుత్వం, వినియోగదారులపై భారం తగ్గుతుందని చర్చ జరుగుతోంది.