CM Revanth Reddy: తెలంగాణలో గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మొదలైన ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం ఇప్పటికీ కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో గెలుపు కోసం నాటి అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పరంపర సాగింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో సీఎంగా ప్రమాణం చేసిన రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై దూకుడు పెంచారు. మరోవైపు బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయినా… తాము ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లు వ్యవహరిస్తోంది. దీంతో అధికార కాంగ్రెస్‌తో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఢీ అంటే ఢీ అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఆరు గ్యారంటీలు, పంట రుణాలు, రైతులకు బోనస్, పంట రుణాల మాఫీ, తాజాగా హైడ్రా కూల్చివేతలపై వరుసగా రగడ జరుగుతోంది. ఇక లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రచార బాధ్యతను భుజానికి ఎత్తుకున సీఎం రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికల్లో బీజేపీ లక్ష్యంగానే ప్రచారం చేశారు. దీంతో రెండు జాతీయ పార్టీలు కలిసి బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా దక్కకుండా చేశాయి. ఈ క్రమంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని ప్రచారం చేశారు. దీనిపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టు సీఎం రేవంత్‌రెడ్డికి నోటీసులు ఇచ్చింది.
నోటిదురుసుతనంతో చిక్కులు..
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో సభలో బీజేపీపై సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందని రేవంత్ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం కేసు వేశారు. కింది కోర్టు పలుమార్లు కేసును వాయిదా వేయడంతో హైకోర్టుకు వెళ్లారు కాసం. హైకోర్టు ఆదేశాలతో రేవంత్ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది.
రేవంత్ తప్పేంటి?
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోతున్నారని అన్నారు. 100 ఏళ్లలో భారత్ ను హిందూ రాజ్యాంగ మార్చాలని 1925లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిజ్ఞ చేసిందని పేర్కొన్నారు. ఆ కుట్రలో భాగంగానే 2025లో భారత దేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా మార్చబోతున్నారని అన్నారు. అందుకే 2/3 మెజారిటీ కావాలని బీజేపీ నేతలు అడుగుతున్నారని తెలిపారు. బీసీలు, ఓబీసీలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారని.. రిజర్వేషన్లను రద్దు చేయమని బీజేపీ ఎందుకు చెప్పడం లేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఈ కుట్రను తిప్పి కొట్టేందుకే కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ కూడా అదే మాట..
గతంలో కేసీఆర్ సీఎం పదవిలో ఉన్నప్పుడు భారత రాజ్యాంగాన్ని మార్చలని ఆయన అన్నారని గుర్తుచేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే బీజేపీ విధానంలో భాగంగానే ఆ మాట అన్నారా? అని నిలదీశారు. రిజర్వేషన్లపై కేసీఆర్ విధానాన్ని ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ విధానం ఏంటో కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో 5 పార్లమెంట్ స్థానాలను కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. ఈటలకు వ్యతిరేకంగా కేసీఆర్ ఎక్కడా మాట్లాడలేదని పేర్కొన్నారు. రేవంత్ ప్రచారం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కోర్టును ఆశ్రయించగా.. తాజాగా నోటీసులు జారీ చేసింది.