CM Revanth Reddy: అదేంటో గాని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఇలా చెప్పుకోవడం చేతకావడం లేదు. చేసిన మంచిని కాస్తయినా జనాలకు అర్థమయ్యేలాగా వివరించలేక పోతే.. అది ఎంత చేసినా ఉపయోగముండదు. బంగారు తెలంగాణ అని.. దేశానికి దారి చూపిస్తోందని.. మేము నడిచిన బాటను దేశం మొత్తం అనుసరిస్తుందని.. పదేపదే చెప్పాడు కేసీఆర్. కానీ తాను తెలంగాణపై మోపిన భారాన్ని.. చేసిన గాయాల్ని మాత్రం వదిలి వెళ్ళిపోయాడు. అది ఇప్పుడు అంతిమంగా రేవంత్ రెడ్డి సర్కార్ కు ఇబ్బందిగా.. భారంగా.. ప్రతిబంధకంగా.. సంకటంగా మారింది.. కాలేశ్వరం కట్టాం.. రైతుల కష్టాలు తీర్చాం.. రైతులను తల ఎత్తుకొనే లాగా చేశామని.. అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ పదేపదే అనేవాడు. ఇక కేటీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాడు దేశం మొత్తం గత్తర లేపుతా.. దేశంలో చక్రాలు తిప్పుతా అని చెప్పి.. పంజాబ్ రైతులకు చెక్కులు కూడా ఇచ్చాడు కేసీఆర్. కానీ తన ప్రభుత్వ పరిపాలన కాలంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు. పైగా ఆ రైతు కుటుంబాలను ఎంతగా ఇబ్బంది పెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ రైతు కుటుంబాలకు రేవంత్ ప్రభుత్వం అండగా నిలిచింది. సరిగ్గా జనవరి 26న 141 రైతు కుటుంబాలకు పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇంతటి సుదీర్ఘ పోరాటంలో రైతుల పక్షాన ప్రముఖ మహిళా న్యాయవాది వసుధ నాగరాజు సహకరించారు. వెళ్లిన ప్రతిచోట తిరస్కారం ఎదురైనప్పటికీ.. రైతు కుటుంబాలు వెనకడుగు వేయలేదు. ఎవరి అండ లేకపోయినప్పటికీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో వారు వెన్ను చూపలేదు. అందువల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్ 141 రైతు కుటుంబాలకు అండగా నిలిచింది. పరిహారం అందిస్తామని జీవో కూడా విడుదల చేసింది.
మంగళవారం నల్లగొండలో రైతు సమస్యల పరిష్కారం కోసం భారత రాష్ట్ర సమితి సభ నిర్వహిస్తోంది. కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని గంగిగోవులాగా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎగిరితన్నే దున్నపోతు లాగా అభివర్ణిస్తున్నారు. కానీ ఇక్కడే అతడు తన ప్రభుత్వ హయాంలో రైతుల జరిగిన అన్యాయాన్ని విస్మరిస్తున్నాడు. 141 మంది రైతు కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన న్యాయాన్ని పక్కన పెడుతున్నాడు.. ఏంటో అధికారం కోల్పోయిన తర్వాత నాయకులందరికీ రైతులు భలే గుర్తుకొస్తారు.
ఇక భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 1000 మంది రిటైర్డ్ ఆఫీసర్లకు ఎక్స్ టెన్షన్ ఆర్డర్ ను ఇచ్చారు. ఇందులో అందరూ కూడా భారత రాష్ట్ర సమితి పెద్ద నాయకులకు దగ్గరివారే. కొందరు కెసిఆర్ కు అత్యంత సన్నిహితులు.. అందువల్లే వారందరికీ సర్వీస్ పొడగింపు ఆర్డర్ లభించింది. అయితే వీరంతా కూడా ఇప్పుడు భారత రాష్ట్ర సమితికి అనుకూలంగా పనిచేస్తున్నారని.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వెంటనే భారత రాష్ట్ర సమితి పెద్దలకు చేరవేరుస్తున్నారని కాంగ్రెస్ పెద్దల అనుమానం. అందువల్లే వారందరికీ సర్వీస్ పొడగింపు లేకుండా.. మార్చి 31 నుంచి అన్ని శాఖల నుంచి వారు రిలీవ్ కావాలని సీఎస్ శాంతి కుమారి ఆర్డర్ జారీ చేశారు. అయితే వీరిలో కేటీఆర్ పర్యవేక్షించిన మున్సిపల్ శాఖలోనే 2 మాది దాకా ఉన్నారట. వీరంతా కూడా గులాబీ పార్టీకి కొమ్ముకాస్తున్నారట. అందువల్లే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీరందరిని ఇంటికి పంపించడానికి సిద్ధమైందట..
రైతు కుటుంబాలకు న్యాయం.. రిటైర్డ్ అధికారులను ఇంటికి పంపడం వాటి నిర్ణయాలు సాహసోపేతమైనవి. ఎందుకంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం రైతు ఆత్మహత్యలను అధికారికంగా గుర్తించడం ఒక సాహసం. స్వతంత్ర భారత చరిత్రలో ఇటువంటి నిర్ణయం ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు తీసుకోలేదు. కానీ ఇంతటి సంచలన నిర్ణయం తీసుకున్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకోలేకపోతోంది. విప్లవాత్మకమైన విధానాలకు శ్రీకారం చుట్టినప్పటికీ జనాల్లోకి తీసుకెళ్లలేక పోతోంది. ఇదే సమయంలో భారత రాష్ట్ర సమితి రైతు అనుకూల పార్టీగా.. ఉద్యోగుల అనుకూల పార్టీగా కాళ్లకు గజ్జలు కట్టుకొని ఆడుతోంది.. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పాల్సిన పనిలేదు.. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిద్రలేస్తుందా? సోషల్ మీడియాను బలోపేతం చేస్తుందా? తాను చేస్తున్న పనులను చెప్పుకోగలుగుతుందా? ఏమో ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. అన్నట్టు ఇటీవల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటించారు. చూడాలి మరి ఏం చేస్తారో?!