CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుకు( Chandrababu) మరో ఊరట దక్కింది. అత్యున్నత న్యాయస్థానంలో ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ పై ఈరోజు తీర్పు వెల్లడించింది సుప్రీంకోర్టు. వైసీపీ హయాంలో చంద్రబాబుపై అవినీతి కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులను సిఐడి నుంచి సిబిఐకి బదలాయించాలని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయింది. పలుమార్లు దీనిపై విచారణ జరిగింది. ఈరోజు కోర్టు తీర్పు ప్రకటించింది. వైసీపీ హయాంలో చంద్రబాబుపై అవినీతి కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 52 రోజులు పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోవాల్సి వచ్చింది. ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ స్కాం చుట్టూ కేసు నడిచింది. దాంతో పాటు మరో ఆరు కేసులను అప్పట్లో నమోదు చేశారు. దీనిపై సుదీర్ఘ న్యాయపోరాటం చేసి చంద్రబాబు బెయిల్ తెచ్చుకున్నారు. అటు తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఏపీ సిఐడి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుంది కనుక.. ఈ కేసును సిబిఐ కి అప్పగించాలని కోరుతూ ఏపీ హైకోర్టు న్యాయవాది బాలయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
* పిటీషనర్ పై కోర్టు ఆగ్రహం
అయితే ఈ కేసు విషయంలో పిటిషనర్ వైఖరి పై సుప్రీంకోర్టు( Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు కోర్టు విచారణకు ఆ పిటిషన్ రాగా జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటీషన్ పై ఒక్క మాట మాట్లాడినా భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. చంద్రబాబుపై దాఖలైన కేసులను సిబిఐకి బదిలీ చేయాలన్న పిటీషనర్ విజ్ఞప్తిని తోసి పుచ్చింది కోర్టు. వీటిపై వాదనలు వినిపించేందుకు ముందుకు వచ్చిన సీనియర్ న్యాయవాది మణిందర్ సింగ్ పై కూడా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లపై కూడా మీరు వాదిస్తారా అంటూ ప్రశ్నించింది.
* అప్పట్లో దూకుడుగా సిఐడి
అప్పట్లో వైసీపీ( YSR Congress) ప్రభుత్వం చంద్రబాబుపై అవినీతి కేసులను నమోదు చేసింది. ఈ విషయంలో ఏపీ సిఐడి అప్పట్లో దూకుడుగా వ్యవహరించింది. ప్రతిపక్ష నేతగా కర్నూలు జిల్లాలో పర్యటనలో ఉండగా.. అర్ధరాత్రి హల్చల్ చేశారు పోలీసులు. వేకువ జామున అరెస్టు చేసి రోడ్డు మార్గంలో అమరావతికి తీసుకొచ్చారు. గుంటూరు సిఐడి కార్యాలయంలో విచారణ చేపట్టారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. అయితే తనపై కేసులు, అరెస్టు విషయంలో కనీస నిబంధన పాటించలేదని.. గవర్నర్ అనుమతి తీసుకోలేదని అప్పట్లో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఆశ్రయించారు. అయితే కింది కోర్టు నుంచి ఆ పిటిషన్ కొట్టివేతకు గురి అయింది. చివరకు సుప్రీంకోర్టు విచారణ చేపట్టి తీర్పును రిజర్వులో ఉంచింది.
* రిమాండ్ ఖైదీగా సుదీర్ఘకాలం
మరోవైపు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో( Rajahmundry Central Jail) చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. అయితే అప్పట్లో అనారోగ్య కారణాలతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అటు తరువాత పూర్తిస్థాయి బెయిల్ మంజూరయింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ కు సంబంధించి తీర్పు రిజర్వులో ఉంది. ఈ సమయంలో ఆ కేసులన్నింటిని సిఐడి నుంచి సిబిఐ కి బదులాయించాలని పిటిషన్ వచ్చింది. దీనిపైనే కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.