BRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైది. దీంతో అప్పటి వరకు బీఆర్‌ఎస్‌లో ఉండి పదవులు అనుభవించిన నేతలు, ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌వైపు చూడడం మొదలు పెట్టారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నెలకే ఖైరతాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లాం వెంకట్రావ్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లోక్‌సభ ఎన్నికలు ముందే బీఆర్‌ఎస్‌ను వీడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ సంజయ్‌కుమార్, కాలే యాదయ్య కూడా అధికార పార్టీలో చేరారు. దీంతో బీఆర్‌ఎస్ ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. తాజాగా బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు కే.కేశవరావు కాంగ్రెస్‌లో చేరి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అ తర్వాత రోజే బీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లో చేరారు.
వరుస షాక్‌లతో ..
వరుస షాక్‌ల నేపథ్యంలో బీఆర్‌ఎస్ అలర్ట్ అయింది. ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిన కే.కేశవరావు కుమార్తె, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని ఆ పదవి నుంచి తప్పించాలని ప్లాన్ చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 12 నియోజకవర్గాల్లో గెలిచింది. మరోవైపు బీఆర్‌ఎస్‌కు మెజారిటీ కార్పొరేటర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసానికి ఆ పార్టీ ప్లాన్ చేసింది. ఈమేరకు శుక్రవారం(జూలై 5న) ప్రత్యేక సమావేవం నిర్వహించింది.
ఎమ్మెల్యేలు డుమ్మా..
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, వివేకానంద, కృష్ణరావు, రాజశేఖరరెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వివేకానంద, లక్ష్మారెడ్డి సమావేశానికి రాలేమని ముందస్తు సమాచారం ఇచ్చారు. ఇక సమావేశానికి 35 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు.
అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి..
ఇక బీఆర్‌ఎస్ కాంగ్రెస్‌ను జీహెచ్‌ఎంసీలో దెబ్బకొట్టాలని చేసిన వ్యూహానికి సొంతపార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లే తూట్లు పొడిచే అవకాశం కనిపిస్తోంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీహెచ్‌ఎంసీలో తమ సత్తా చాటాలనుకుని సమావేశం ఏర్పాటు చేస్తే.. పార్టీలో ఉండి పక్క చూపులు చూస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.