Team India Victory Parade: టీమిండియా విక్టరీ పరేడ్.. ఆనంద్ మహీంద్రా, గంగూలీ, షారూఖ్.. ఎలా స్పందించారంటే..

గురువారం సాయంత్రం ముంబై చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు ముంబై మహానగర ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు విక్టరీ పరేడ్ నిర్వహించారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 5, 2024 4:25 pm

Team India Victory Parade

Follow us on

Team India Victory Parade: దాదాపు 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ ను గెలుచుకుంది. బార్బడోస్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ ప్రాంతంలో ఏర్పడిన హరికేన్ వల్ల మూడు రోజులపాటు బార్బడోస్ లోని హోటల్ గదులకే పరిమితమైంది. చివరికి వాతావరణం అనుకూలంగా మారడంతో ప్రత్యేక విమానం ద్వారా గురువారం తెల్లవారుజామున స్వదేశానికి చేరుకుంది. ఈ సమయంలో రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను బిసిసిఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, కెప్టెన్ రోహిత్ శర్మ కట్ చేశారు. అనంతరం ఐటీసీ మౌర్య హోటల్ చేరుకున్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

గురువారం సాయంత్రం ముంబై చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు ముంబై మహానగర ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు విక్టరీ పరేడ్ నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీకి దాదాపు లక్షలాదిమంది అభిమానులు హాజరయ్యారు. టీమిండియా ఆటగాళ్లను తమ సెల్ ఫోన్లలో బంధించారు. తమ అభిమాన ఆటగాళ్లను చూస్తూ సందడి చేశారు. నృత్యాలు చేస్తూ, కేరింతలు కొట్టారు. లక్షలాదిగా వచ్చిన అభిమానులతో ముంబై మహానగరం కిక్కిరిసిపోయింది. విక్టరీ పరేడ్ బిసిసిఐ ఊహించిన దానికంటే 1000రెట్లు విజయవంతమైంది.

ఈ దృశ్యాలను పలువురు సెలబ్రిటీలు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో మహీంద్రా గ్రూప్ సంస్థల అధిపతి ఆనంద్ మహీంద్రా, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఉన్నారు. వారు తమ ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ ఖాతాలలో ఈ ఫోటోలను పోస్ట్ చేశారు.. “మహారాణి బంగారు నెక్లెస్ కూడా ఇంత పొడవు ఉండదు.. ఇది విజయం సాధించిన ఆభరణం” అంటూ ఆనంద్ మహీంద్రా క్యాప్షన్ జత చేశారు.. ” భారతీయులు క్రికెట్ ను అపరిమితంగా ఇష్టపడతారు. ఇదే వారిని ఇతర దేశాలకు భిన్నంగా చూపిస్తుంది. ఆటగాళ్లు వారు సాధించిన విజయానికి పూర్తిగా అర్హులు. వారి విజయాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడని” గంగూలీ రాసుకొచ్చాడు. ” అబ్బాయిలూ.. చాలా సంతోషంగా ఉంది. మీరు సాధించిన విజయం గొప్పగా ఉంది. ఈ రాత్రి ముంబై మొత్తం మీ వెంటే ఉంది. దేశం మొత్తం మీ విజయాన్ని చూసి గర్వపడుతోంది. ఇది చాలా ఆనందదాయకమైన విషయం.. మీ స్ఫూర్తిని ఇలాగే కొనసాగించండంటూ” షారుక్ ట్విట్టర్ ఎక్స్ లో పేర్కొన్నాడు.

ఇక విక్టరీ పరేడ్ లో టీమిండియా ఆటగాళ్లు నారిమన్ పాయింట్ నుంచి వాంఖడె స్టేడియం వరకు విక్టరీ పరేడ్ నిర్వహించారు. తర్వాత వాంఖడె స్టేడియంలో టీమిండి ఆటగాళ్లకు బీసీసీఐ సన్మానం నిర్వహించింది. ఈ సందర్భంగా రోహిత్ చాలా ఉద్వేగంగా మాట్లాడాడు. అతడు మైదానంలోకి వస్తున్న సమయంలో అభిమానులు రోహిత్ రోహిత్ అంటూ నినాదాలు చేశారు. ఇది బాహుబలి -1 సినిమాలో ఇంటర్వెల్ సీన్ ను తలపించిందని సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యానించారు.