Teenmar Mallanna: పార్లమెంటు ఎన్నికలకు కేవలం కొన్ని గంటల ముందు తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి హస్తంపార్టీ తీన్మార్ మోగించింది. ఇక కరీంనగర టికెట్‌పై ఆశలు పెట్టుకున్న తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్‌కు) ఇదే సమయంలో బంపర్ ఆఫర్ ఇచ్చింది. జనగామ ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఖాలీ అయిన నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌లో బుధవారం సాయంత్రం(ఏప్రిల్ 24న) తీన్మార్ మోగింది.
2027 వరకు పదవీకాలం..
నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి
2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటీ చేయగా, స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పల్లా విజయం సాధించగా, మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. ఈ పదవీకాలం 2027 వరకు ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
త్వరలో ఎన్నికలు..
డిసెంబర్ 9న పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో త్వరలోనే ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను లోక్‌సభ ఎన్నికల తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే హస్తం పార్టీ తమ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును ప్రకటించింది.
బీఆర్‌ఎస్ నుంచి రాకేశ్‌రెడ్డి..
ఇక సిట్టింగ్ స్థానం నిలుపుకునేందుకు బీఆర్‌ఎస్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. సరైన అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో పడింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని తమ ఖాతాలోనే వేసుకునేందుక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ తరఫున ఏనుగుల రాకేశ్‌రెడ్డిని నిలిపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.