Jagan
Jagan: అనుకున్నట్టే అవుతోంది. కడపలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య అంశం ప్రచారాస్త్రంగా మారింది. వైయస్ వివేకానంద రెడ్డి ని హత్య చేసిన వ్యక్తికి ఎలా టికెట్ ఇచ్చావని షర్మిల తో పాటు సునీతలు ప్రశ్నిస్తున్నారు. నిందితుడికి రక్షణ కల్పిస్తున్నావంటూ జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో జగన్ ఆత్మరక్షణలో పడ్డారు. అయితే ఇప్పటికే ప్రజల్లోకి ఒక రకమైన అభిప్రాయం వెళ్లడంతో ఎదురుదాడికి సిద్ధమయ్యారు. తాను పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గం లో జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సంబంధం లేదని జగన్ తేల్చి చెప్పారు. ఆయన ఏ తప్పు చేయలేదని కూడా కితాబు ఇచ్చారు. ఆయన ఒక చిన్న పిల్లోడు అని అభివర్ణించారు. ఆయన రాజకీయ జీవితాన్ని తెరమరుగు చేయాలని చూడడం దారుణమని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని జగన్ వివేకానంద రెడ్డి రెండో భార్య, సంతానం గురించి ప్రస్తావించారు. ఎవరు ఫోన్ చేయడం వల్ల అవినాష్ అక్కడకు వెళ్లారో అంటూ జగన్ చేసిన కామెంట్స్ సునీత దంపతులపైనేనని తెలుస్తోంది. మొత్తానికి అయితే జగన్ ప్రసంగం వింటే మాత్రం.. వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారో అర్ధం అవుతుంది.
మరోవైపు జగన్ వైఖరిని తప్పుపడుతూ వివేకానంద భార్య సౌభాగ్యమ్మ నేరుగా బహిరంగ లేఖ రాశారు. వివేక హత్యకు కారకులైన వారికి మళ్లీ ఎంపీ అభ్యర్థిగా ఎలా అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు. 2009లో మీ తండ్రిని కోల్పోయినప్పుడు మీరు ఎంత మనోవేదన అనుభవించారో.. 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే వేదన అనుభవించారని సౌభాగ్యమ్మ గుర్తు చేశారు. వివేకానంద రెడ్డిని కుటుంబ సభ్యుల హత్య చేస్తే.. వారిని శిక్షించాల్సింది పోయి.. రక్షిస్తావా అంటూ నిలదీశారు. నిన్ను సీఎంగా చూడాలని పరితపించిన చిన్నాన్నపై సొంత మీడియాతో విమర్శలు చేయిస్తావా అంటూ ప్రశ్నించారు. న్యాయం కోసం పోరాడుతున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తూ నిందలు మోపడం దారుణమని సౌభాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
వివేకానంద రెడ్డి హత్యకు కారకులైన వారికి మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం సమంజసమేనా? ఇలాంటి దుశ్చర్యలు నీకు ఏమాత్రం మంచిది కాదు. హత్యకు కారకుడైన నిందితులు నామినేషన్ దాఖలు చేశాడు. చివరి ప్రయత్నం గా ప్రార్థిస్తున్న. రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా.. న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడాలని సౌభాగ్యమ్మ జగన్ ను కోరారు. తానే స్వయంగా లేఖ రాసి సీఎం జగన్ కు పంపించారు.