Also Read: మరిన్ని బలగాల తరలింపు వద్దు
ఓ అబ్బాయి, ఓ అమ్మాయి కుటుంబాల మధ్య జరిగిన గొడవతో ఆ గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అర్ధరాత్రి తమ ఇంట్లోకి చొరబడ్డాడని ఏకంగా ఆ అబ్బాయిని అమ్మాయి కుటుంబం చంపేసింది. ఇందులో కులం కూడా ముడిపడి ఉండటంతో ఇరు కుటుంబాలు, ఇరు గ్రామాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితులు తలెత్తాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ఉన్న అన్ని స్టేషన్ల నుంచి అక్కడ పోలీసులను మోహరించారు.
అయితే.. ఈ ఘటనపై ఇరువైపులా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాలిక కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ అమ్మాయిని కలిసేందుకు ఇద్దరు టీనేజ్ అబ్బాయిలు ఇంటి ప్రహరీ దూకి లోపలికి చొరబడ్డారు. ఆ సమయంలో వరండాలో నిద్రిస్తున్న బాలిక తాత అలికిడికి నిద్ర లేచాడు. ఏదో అనుమానాస్పదంగా అనిపించడంతో వెంటనే ఇంట్లో వాళ్లను అప్రమత్తం చేశాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల వాళ్లు అంతా పోగయ్యారు. ఇంట్లోకి చొరబడ్డ ఆ ఇద్దరు అబ్బాయిలను అంతా కలిసి చితకబాదారు. అమ్మాయిని కలిసేందుకు వచ్చిన అబ్బాయి తరలించేసరికే మృతి చెందగా మరొక అబ్బాయి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.
స్థానిక ఎస్ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ ఈ ఘటనపై స్పందిస్తూ ఓ టీనేజ్ అబ్బాయి ఓ అమ్మాయిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లగా అతనిపై దాడి జరిగినట్లు తమకు సమాచారం అందిందన్నారు. వెంటనే సీనియర్ పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు. మృతుడి కుటుంబం బాలిక కుటుంబంపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఇప్పటికే నలుగురిని అరెస్ట్ కూడా చేశామని చెప్పారు.అరెస్టయిన వారిలో ఇద్దరు బాలిక బంధువులతోపాటు ఇద్దరు చుట్టుపక్కల వ్యక్తులు ఉన్నారు.
ఇదే ఘటనపై మృతుడి తండ్రి మాట్లాడుతూ… ‘మా అబ్బాయి, ఆ అమ్మాయి ఇద్దరూ ఒకే స్కూల్లో చదువున్నారు. ఇద్దరివి పక్క పక్క గ్రామాలే. ఇద్దరి మధ్య స్నేహం బహుశా ఆ కుటుంబానికి నచ్చలేదు. అంతమాత్రానికే మా కొడుకుని చంపడం ఏంటి’ అని ప్రశ్నించారు. ‘మా అబ్బాయి వాళ్ల ఇంట్లోకి చొరబడ్డాడో లేదా ఎక్కడైనా పట్టుకుని దాడి చేసి చంపేశారో తెలియదు..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై ఆ బాలికే తమ గ్రామస్తులకు సమాచారం అందించిందని చెప్పారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో భోజనం తర్వాత తమ అబ్బాయి అతని స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడన్నారు. కొన్ని గంటల తర్వాత తమ కొడుకును ఎవరో చంపేసినట్లు సమాచారం అందిందన్నారు.
బాలిక బంధువు ఒకరు మాట్లాడుతూ… ‘సదరు అబ్బాయి తన స్నేహితుడితో కలిసి బైక్‌పై ఆమె ఇంటికి చేరుకున్నాడు. ఇంటి పక్కనున్న పంట పొలాల వైపు నుంచి లోపలికి చొరబడే ప్రయత్నం చేశాడు. ఎవరి అనుమతి లేకుండా లోపలికి వెళ్లడంతో అతనిపై దాడి జరిగింది. అంతా 20–-25 నిమిషాల్లోనే జరిగిపోయింది. ఘటన సమయంలో బాలిక తండ్రి ఇంట్లో లేడు. ఆమె తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉంది. నిజానికి కరోనా లాక్ డౌన్‌తో స్కూల్ మూతపడ్డప్పటి నుంచి ఆ అబ్బాయి ఆమెను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాడు’ అని చెప్పుకొచ్చింది.
Also Read: మోడీ సార్ టూర్ ల ఖర్చు ఎంతో తెలుసా?
మృతి చెందిన బాలుడు(17) ఇటీవలే 12వ తరగతి పరీక్షలు పూర్తి చేశాడని, ఖాళీ సమయంలో కూలీ పనులకు వెళ్తున్నాడని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. తలపై బలమైన గాయాలు కావడంతోనే అతను మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బాలుడు గుజ్జర్ సామాజిక వర్గానికి చెందినవాడు కాగా.. బాలిక ఠాకూర్ సామాజికవర్గానికి చెందినదని చెప్పారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఠాకూర్ల ఆధిపత్యమే ఎక్కువ కాగా.. ఆ బాలుడు ఉండే ఒక్క గ్రామంలో మాత్రమే గుజ్జర్ల ఆధిపత్యం ఉంది. అయితే.. ఇరువురి మధ్య ఇప్పటికైతే ఎలాంటి గొడవలు లేవు. తాజా ఘటన నేపథ్యంలో ఇరువురి మధ్య ఎలాంటి పరిస్థితులు వస్తాయోనని ముందుగానే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.