Jagtial: లక్షల్లో జీతాలు వస్తున్నాయి. భత్యాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. ఆయన అప్పటికి కొంతమంది ప్రభుత్వ అధికారులకు సరిపోవడం లేదు. పైగా మరింత సంపాదించాలనే యావతో లంచాలకు ఆశపడుతున్నారు. ప్రజలను వేధిస్తున్నారు.. ఏసిబి దాడుల్లో దొరికిపోయినప్పటికీ వారు ఏమాత్రం భయపడటం లేదు. పైగా కార్యాలయాల్లోనే లంచాలు వసూలు చేసుకుంటూ అంతకంతకు ఎదిగిపోతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ సంఘటన ప్రభుత్వ అధికారుల్లో పేరుకుపోయిన లంచం అనే జాడ్యాన్ని కళ్ళకు కట్టింది. ఇదే సమయంలో లంచాలు ఇవ్వలేక ప్రజలు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు చూపింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార సొసైటీలకు పలు రాయితీలు ఇస్తోంది. వలలు, ద్విచక్ర వాహనాలు, ఉచితంగా చేపలు పంపిణీ చేస్తోంది. అయితే ఇవన్నీ దక్కాలి అంటే మత్స్యకారులు ఒక సొసైటీగా ఏర్పడాలి. ఆ సొసైటీ లో ఉన్న సభ్యులకు మాత్రమే ప్రభుత్వం ఈ రాయితీలు ఇస్తుంది. అయితే ఇలాంటి రాయితీలు పొందేందుకు జగిత్యాల జిల్లాలో కొంతమంది మత్స్యకారులు ఒక సొసైటీగా ఏర్పడ్డారు. అయితే తమ సొసైటీకి అధికారికంగా గుర్తింపు ఇవ్వాలని కొంతకాలంగా స్థానికంగా ఉన్న మత్స్య శాఖ అధికారికి చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఆ మత్స్యకారులు చెప్పిన మాటలను ఆ అధికారి పెడచెవిన పెట్టుకుంటూ వస్తున్నాడు. తనకు ఎంతో కొంత ముట్టు చెబితేనే మత్స్య సహకార సంఘానికి అధికారికంగా గుర్తింపు ఇస్తానని అసలు విషయం చెప్పాడు. దీంతో ఆ మత్స్యకారులకు కడుపు రగిలిపోయింది.
మెడలో నోట్ల దండలు వేశారు
ఇక తన మాట వినడం లేదని ఆ మత్స్యకారులు ఆ అధికారికి సరైన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. నేరుగా జిల్లా కలెక్టరేట్ లోని ఆయన కార్యాలయానికి వెళ్లి మాట్లాడారు. అయినప్పటికీ ఆ అధికారి తన మనసు మార్చుకోలేదు. పైగా డబ్బులు ఇస్తేనే మత్స్య సహకార సంఘానికి అధికారికంగా గుర్తింపు ఇస్తానని తేల్చి చెప్పాడు. దీంతో ఆ మత్స్యకారుల కడుపు మండిపోయింది. వెంటనే తమ వద్ద ఉన్న నోట్లను దండగా మార్చి అతని మెడలో వేశారు. ఈ డబ్బు కోసమే కదా తమ సహకార సంఘానికి అధికారికంగా గుర్తింపు ఇవ్వడం లేదని.. అందుకే ఈ నోట్లు తీసుకొని ఆ పని చేయండి అంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. దీంతో ఆ అధికారి తెల్ల మొహం వేశాడు. దీనిని కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. అయితే ఈ విషయం ప్రభుత్వ పెద్దల దాకా వెళ్లడంతో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మెడలో నోట్ల దండలు కాదు గాడిద మీద ఊరేగించాలని వ్యాఖ్యానిస్తున్నారు.
View this post on Instagram