MLC Kavitha : గతమెంతో ఘనం.. వర్తమానం అంధకారం..’ అన్నట్లుగా మారింది కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత పరిస్థితి. బతుకమ్మ ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబైంది. పూల పండుగ కోసం మహిళలంతా రెడీ అవుతున్నారు. ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాములాయే సందమామ.., బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో.. అంటూ నేటి సాయంత్రం పల్లె నుంచి పట్టణం వరకూ పాటలతో మారుమోగనున్నాయి. ఇప్పటికే ఊళ్లకు చేరుకున్న మహిళలంతా మరికొద్ది గంటల్లోనే ఒక దగ్గరకు చేరి ఆడిపాడనున్నారు. ఒకవిధంగా ఈ తొమ్మిది రోజులపాటు తెలంగాణలో మహిళలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే పండుగ ఈ బతుకమ్మ. సంబరాలకు సిద్ధమవుతున్న తెలంగాణ ఇప్పుడు ఒక్కసారిగా కవిత వైపు చూస్తోంది.
తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలకు కేరాఫ్ అడ్రస్‌గా కవిత నిలిచారు. బతుకమ్మ అంటే కవిత.. కవిత అంటే బతుకమ్మ అన్నట్లుగా ఏటా.. బతుకమ్మ పండుగ వచ్చిందంటే అలాంటి పండుగ వాతావరణం కనిపించేది. రాష్ట్రం ఏర్పాటై దశాబ్దకాలం గడిచినప్పటికీ ఇంతవరకు ఆమె ఏనాడూ బతుకమ్మ వేడుకలకు దూరంగా లేరు. ఏటా పండుగ వచ్చిందంటే తన షెడ్యూల్‌ను ప్రకటించే వారు. జాగృతి ఆధ్వర్యంలో ఆయా మేజర్ టౌన్లలో ఉత్సవాలు ఏర్పాటు చేసి మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చి వారితో ఆడిపాడేవారు. ఒకవిధంగా చెప్పాలంటే ఈ ఉత్సవాలకు హాజరవుతున్నంత సేపు ఆమె ఓ ముఖ్యమంత్రి బిడ్డను అని, తాను ఓ పొలిటీషియన్ అనే స్వభావం ఎప్పుడూ చూపేవారు కాదు. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగానూ తెలంగాణ బతుకమ్మకు కవితనే ప్రాచూర్యం కల్పించరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ సాయంత్రం నుంచి తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కానీ.. కవిత మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అనారోగ్య కారణాలతో నిన్న ఆస్పత్రికి వెళ్లిన ఆమె.. ఈ రోజు నుంచి జరిగే బతుకమ్మ పండుగలో పాల్గొంటారా అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమె అరెస్టై 153 రోజులపాటు జైలు జీవితాన్ని గడిపారు. నెలరోజుల క్రితమే ఆమె బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇక అప్పటి నుంచి కవిత ప్రజల్లోకి రాలేదు. బతుకమ్మ ఉత్సవాలతో బయటకు వస్తారని అందరూ భావించారు. ప్రజలతో కలిసిపోతారని అంతా అనుకున్నారు. కానీ.. ఇంతవరకు ఆమె నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దాంతో కవిత అభిమానులు నిరాశలో ఉండిపోయారు. ఆమె నుంచి ప్రకటన రాకపోవడంతో ఇక బతుకమ్మ ఉత్సవాలకు దూరం అయినట్లేనని అర్థం చేసుకోవచ్చు.
నాలుగు నెలలకు పైగా కవిత జైలు జీవితాన్ని గడిపారు. ఆ క్రమంలో ఆమె కొన్ని సందర్భాల్లో తీవ్ర జ్వరం బారిన పడ్డారు. జ్వరంతోపాటు కొన్ని గైనిక్ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. దాంతో ఆమె అప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో నిన్న కూడా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందారు. గైనిక్ సమస్యతో బాధపడుతున్న ఆమె రిపోర్టులను డాక్టర్లు పరిశీలించారు. వారి సలహాలు, సూచనల మేరకు ఆమె ఉత్సవాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. మరో టాక్ కూడా నడుస్తోంది. ఆమె అనుభవించిన పరిస్థితుల నేపథ్యంలో ఇక కవిత రాజకీయాల్లోకి రాకపోవచ్చన్న ప్రచారం సైతం వినిపిస్తోంది. రుద్రాక్ష ధరించి ఉన్న ఆమె ఆధ్యాత్మికం వైపు వెళ్లిపోయే అవకాశాలు ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. అయితే.. అనారోగ్యం సమస్యల వల్లే ఇప్పుడు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని, ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తారని మరో వర్గం చెబుతోంది. మొత్తంగా మొదటిసారి కవిత బతుకమ్మ ఉత్సవాలకు దూరం కావడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది.