New Railway Line: కేంద్రం రోడ్డు, రైలు మార్గాల విస్తరణపై దృష్టిసారించింది. ఇప్పటికే వందల కిలోమీటర్ల దూరంలో రోడ్డు నిర్మాణం పూర్తయింది. రైల్వేలైన్ నిర్మాణ పనులు కొనసాగుతన్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మూడో రైల్వే లైన్ నిర్మాణం కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే కాజీపేట నుంచి కాగజ్‌నగర్‌వరకు మూడోలైన్ పనులు పూర్తయ్యాయి. కాజీపేట నుంచి సికింద్రాబాద్ వరకు పనులు జరుగుతున్నాయి. ఇక గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు కూడా ప్రారంభమయ్యాయి. రహదారులు, రైలు మార్గాల విస్తరణతో అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి ఈ క్రమంలో కేంద్రం తెలంగాణకు మరో శుభవార్త చెప్పింది. కొత్తగా ఒడిశా వరకు మరో రైలుమార్గం మంజూరు చేసింది. ఇందుకోసం రూ.7,383 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.
ఐదు రాష్ట్రాలు.. 290 కిలోమీటర్లు..
ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు ఈ కొత్త రైల్వేలైన్ నిర్మిస్తారు. సుమారు 290 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ గిరిజన ప్రాంతాలను కలుపుతూ సాగుతుంది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి తెలంగాణలోని భద్రాచలం మీదుగా నిర్మించే ఈ రైల్వేలైన్ పాండురంగాపురం వరకు సాగుతుంది. సరుకు రవాణాకు ప్రాధాన్యం ఇచ్చేలా దీనిని నిర్మిస్తున్నారు. ఇందుకు రూ.7,383 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈమేరకు కొత్త లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. కొత్త రైల్వేలైన్‌తో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు కూడా అధిక ప్రాధాన్యత దక్కుతుంది.
34 వంతెనల నిర్మాణం..
ఇక కొత్త రైలేలైన్ మార్గంలో మొత్తం 34 వంతెనలు వస్తాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను, తూర్పు ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానం చేయడంతోపాటు మహానది కోల్‌ఫీల్డ్ నుంచి దక్షిణ భారత దేశంలోని విద్యుత్ తయారీ ప్లాంట్లకు బొగ్గు సరఫరా వేగవంతం చేయడానికి ఈ రైల్వేలైన్ ఉపయోగపడుతుంది. ఇనుప ఖనిజం, అల్యూమినియం పరిశ్రమకు కూడా కొత్త రైల్వేలైన్‌తో లబ్ధి చేకూరుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సులభం అవుతుంది. ఈ మార్గంలో మొత్తం 34 వంతెనలు, 264 చిన్న వంతెనలు 41 ఆర్వోబీలు, 76 ఆర్‌యూబీలు నిర్మిస్తారు. భద్రాచలం వద్ద గోదావరిపై భారి వంతెన నిర్మిస్తారు. ఖాజీపేట–విజయవాడ ప్రధాన మార్గానికి ఇది బ్రాంచ్‌లైన్‌గా చెప్పవచ్చు.
తీర ప్రాంతాలకు ప్రత్యామ్నాయం..
ప్రస్తుతం చెన్నై, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ మీదుగా కోల్‌కత్తా వరకు రైల్వేలైన్ ఉంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఈ వరంగల్–భద్రాచలం–మల్కన్‌గిరి–జయపూర్–టిట్లాగఢ్ మార్గం ప్రత్యామ్నాయంగా ఉంది. దీంతో బస్తర్ నుంచి దక్షిణ భారత దేశానికి 124 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. కొత్త రైల్వేలైన్ నిర్మాణం పూర్తయితే రాజమండ్రి, విశాఖపట్టణం వంటి రద్దీ మార్గాలపై ఒత్తిడి తగ్గుతుంది. ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో కార్మికులకు కోటి పనిదినాలు ఉపాధి లభిస్తుంది.