RK Kotha Paluku On KCR: ఆదివారం నాటి ఆంధ్రజ్యోతి ఎడిషన్ లో.. తన కొత్త పలుకులో కీలక విషయాలను రాధాకృష్ణ వెల్లడించాడు. ఇందులో ప్రముఖంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబ వ్యవహారాల గురించి ప్రధానంగా రాసుకొచ్చాడు రాధాకృష్ణ. అందులో కేటీఆర్, ఆయన సోదరి మధ్య ఏర్పడిన వివాదం.. మధ్యలో హరీష్ రావు ఎంట్రీ.. బిజెపి పెద్దల ఆఫర్లు.. తర్వాత జరిగిన పరిణామాలను రాధాకృష్ణ రాసుకొచ్చారు. మొత్తంగా కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు కేటీఆర్, సంతోష్ రావు అనే రాధాకృష్ణ మొహమాటం లేకుండా చెప్పేశారు. గులాబీ సుప్రీం కుమార్తె తన కుమారుడి గ్రాడ్యుయేషన్ డే వేడుక కోసం అమెరికా వెళ్లిన తర్వాత వ్యూహాత్మకంగానే ఆమె రాసిన లెటర్ ను లీక్ చేశారని.. ఆమె ఏకంగా ఈ పరిణామాన్ని తట్టుకోలేక తన తండ్రి చుట్టూ దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆ దయ్యాలు ఇప్పుడు ఎవరో తేలవలసి ఉందని చెప్పిన రాధాకృష్ణ.. ఆ దయ్యాలను కేటీఆర్, సంతోష్ రావు గా పరిగణించాల్సి ఉంటుందని రాధాకృష్ణ స్పష్టం చేశాడు.
అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ కు అమితమైన ప్రాధాన్యాన్ని కేసీఆర్ ఇచ్చారు. ఇది సహజంగానే కల్వకుంట్ల కవితకు నచ్చలేదట. పైగా రెండవ టర్మ్ చివరి రెండు సంవత్సరాలు సంతోష్ రావు ప్రభుత్వంలో అన్ని తానై నడిపించాడట. అది కల్వకుంట్ల కవితకు ఇబ్బందికరంగా పరిణమించిందట. ఒకానొక దశలో ఈ పరిణామాన్ని కేటీఆర్ కూడా తట్టుకోలేకపోయాడట. ఇక అప్పట్నుంచి కల్వకుంట్ల కవితలో ఆగ్రహం పెరిగిపోయిందట. చివరికి హరీష్ రావు కూడా ఫామ్ హౌస్ గేట్లు తెరుచుకోలేదట. ఇక ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ముందు హరీష్ రావుతో బిజెపి పెద్దలు అప్రోచ్ అయ్యారట. దీంతో అప్రమత్తమైన కేసీఆర్ హరీష్ రావుకు టచ్ లోకి వెళ్ళాడట. వాస్తవానికి కల్వకుంట్ల కవిత అరెస్టు అయిన సందర్భంగా బిజెపి పెద్దలతో కేసిఆర్ టచ్ లోకి వెళ్తే.. అతని వ్యవహార శైలి గతంలో కాంగ్రెస్ పార్టీతో ఎలా ఉందో తెలుసుకున్న కమలం పెద్దలు వద్దనుకున్నారట.
అటు కేటీఆర్.. ఇటు సంతోష్ రావు వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను మనసులో పెట్టుకున్న కవిత హరీష్ రావుకి టచ్లోకి వెళ్లారట. అయితే ఈ పరిణామాన్ని ఊహించిన కేసీఆర్ హరీష్ రావుకి వర్తమానం పంపారట. అందువల్లే ఆయన ఇటీవల ఫామ్ హౌస్ కి వెళ్లి చాలాసేపు చర్చించారట. అంతేకాదు ఇటీవల కేటీఆర్ కూడా హరీష్ రావును కలవడానికి ప్రధాన కారణం కూడా ఇదేనట. ఇక కవితకు బాల్క సుమన్ కు ఇచ్చిన ప్రాధాన్యం కూడా పార్టీలో ఇవ్వడం లేదట. ఇటీవల అమెరికాలో భారత రాష్ట్ర సమితి రజతోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏర్పాట్లును పర్యవేక్షించడానికి బాల్క సుమన్ కేటీఆర్ ప్రతినిధిగా అమెరికా వెళ్లిపోయాడు. అయితే అమెరికాకు వెళ్లిన కవితకు అక్కడి తెలుగు సంఘాలు.. అక్కడి భారత రాష్ట్ర సమితి నాయకులు ఆహ్వానం పలకలేదట. కనీసం పట్టించుకోలేదట.. అందువల్లే కవిత ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
మొత్తానికి ఇన్ని విషయాలను కుండబద్దలు కొట్టిన రాధాకృష్ణ.. అంతపురంలో జరుగుతున్న రాజకీయాలను బయటపెట్టారు. ఇక్కడ వైయస్సార్, కెసిఆర్ కుటుంబాల వరకే పరిమితమైన రాధాకృష్ణ.. గతంలో నందమూరి తారకరామారావు కుటుంబంలో ఏం జరిగిందో మాత్రం చెప్పలేకపోయారు. అంటే రాధాకృష్ణ రాయలేక పోయినంతమాత్రాన సీనియర్ ఎన్టీఆర్ కుటుంబంలో ఏం జరిగిందో తెలుగు వాళ్లకు తెలియదా? రాధాకృష్ణ రాయకుండా ఉంటే మాత్రం నాటి పరిణామాలు తెలియకుండా ఉంటాయా?!