Telangana : తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు.. వాళ్లపై అనర్హత వేటు ఖాయం.. కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణలో అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు వస్తాయా.. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా.. ఫిరాయింపు ఎమ్మెల్యేపై ఆ పార్టీ పోరాటం ఫలిస్తుందా.. కోర్టు తీర్పు ఆ నేతకు ముందే తెలిసిందా.. ఆయన చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏమిటి.. తెలంగాణలో ఇప్పుడు చర్చ జరుగుతోంది.

Written By: NARESH, Updated On : August 5, 2024 2:28 pm
Follow us on

Telangana : తెలంగాణలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు తప్పవా.. బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందా… అంటే అవుననే అంటున్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని జోష్యం చెప్పారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలోనూ బీఆర్‌ఎస్‌ న్యాయ పోరాటం చేస్తుందని తెలిపారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్‌ ప్రతినిధులు ఈ మేరకు త్వరలోనే సమావేశం అవుతారని వెల్లడించారు. ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో పార్టీ తరఫున పిటిషన్‌ వేస్తామని తెలిపారు. జడ్జిమెంట్‌ ఎలా వస్తుందో కూడా కేటీఆర్‌ వెల్లడించారు. నెల రోజుల్లోనే ఫిరాయింపు నేతల అనర్హత అంశంపై స్పష్టత వస్తుందని రాజ్యాంగ నిపుణులు తెలిపినట్లు వెల్లడించారు. గతంలో మణిపూర్‌ ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్టు తీర్పులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలంపాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్‌ ఈ అంశాన్ని నాన్చలేరని స్పష్టం చేశారు.

ముగ్గురు ఎమ్మెల్యేలపై పిటిషన్‌..
ఈ సందర్భంగా ముగ్గురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లాం వెంకట్రావు అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్‌తోపాటు, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన స్పీకర్‌కు చేసిన ఫిర్యాదు విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్‌ఎస్‌ నేతలు అందించారు. ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు.

నిపుణులతో సంప్రదింపులు..
సుప్రీంకోర్టు తీర్పులతోపాటు న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని కేటీఆర్‌ తెలిపారు. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హతవేటు అంశం తేలిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు. ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులపైన సుద్దపూస ముచ్చట్లు చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని కేటీఆర్‌ మండిపడ్డారు. త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదులతో జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్‌ నాయకులు మాజీ మంత్రి హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు వద్ధిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డితోపాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

తాము చేస్తే సంసారం..
ఇదిలా ఉంటే.. కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి. గతంతో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా, కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆ పార్టీలో చేర్చుకున్నారు. నాడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారినవారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. కానీ నాటి స్పీకర్‌ నాచ్చివేత ధోరణి అవలంబించారు. కానీ, ఇప్పుడు కేటీఆర్‌ మాత్రం వెంటనే చర్య తీసుకోవాలని కోరడం ఆశ్చర్యంగా ఉంది. తాము చేస్తే సంసారం.. మరొకరు చేస్తే వ్యభిచారం అన్న చందంగా కేటీఆర్‌ తీరు ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.