MLA Venkata Ramana Reddy: ఎన్నికల్లో గెలవడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచిన తర్వాత వాటిని తిరిగి ఎలా సంపాదించుకోవాలని చూస్తుంటారు. ఖాళీ జాగాలు కనిపిస్తే కబ్జాలు చేయడం, వ్యాపారులు, భవనాలు నిర్మించే వారి నుంచి అనుమతుల పేరుతో అక్రమంగా డబ్బులు గుంజడం, ప్రభుత్వ భూములను పట్టా చేసుకోవడం, ప్రైవేటు భూవివాదాలను సెటిల్‌మెంట్ పేరుతో కాజేయడం లాంటివి చూస్తున్నాం. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇలాంటి దందాలు బాగా పెరిగాయి. అయితే ఇదే తెలంగాణలో ఓ ఎమ్మల్యే రోడ్డు విస్తరణ కోసం అడ్డుగా ఉన్న తన ఇంటినే అందరికంటే ముందే కూల్చేసుకున్నారు. ఆయన ఎవరో కాదు జాయింట్ కిల్లర్.. ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన అనామకుడు. ప్రజల నేత కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి.
ఏం జరిగిందంటే..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేటు వరకు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ల రోడ్డు నిర్మించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అది కేవలం 30 ఫీట్లు మాత్రమే ఉంది. దీని విస్తరణకు అనేక ఇళ్ల నిర్మాణాలు ఆటంకంగా మారాయి. ఇళ్ల ఎదుట కులాయిలు పెట్టుకున్నారు. షెడ్లు వేసుకున్నారు. గతేడాది కొత్త మాస్టర్ ప్లాన్‌పై రచ్చ జరిగింది. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నాడు రైతుల పక్షాన నిలిచారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఈ సమయంలో కొత్త మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని పోరాడారు. పాత ప్లాన్ ప్రకారం రోడ్డు విస్తరణకు తాను సహకరిస్తానన్నారు. ముందుగా తన ఇంటినే కూల్చేస్తానని ఛాలెంజ్ చేశారు. చెప్పినట్లుగానే ఎమ్మెల్యే అయ్యాక తన ఇంటినే ముందుగా కూల్చేసుకున్నారు. మిగతావాళ్లు కూడా రోడ్డును కూల్చి సహకరించాలని కోరారు.
స్థలం అధికారులకు అప్పగింత..
రోడ్డు విస్తరణకు ఆటంకంగా ఉన్న తన ఇంటికి కూల్చాలని నిర్ణయించుకున్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఈమేరకు ఆర్‌అండ్‌బీ, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు శనివారం ఎమ్మెల్యే ఇంటికి జేసీబీలతో చేరుకున్నారు. ఎమ్మెల్యే దగ్గరుండి ఇంటికి కూల్చివేయించారు. అదే రోడ్డులో ఉన్న పంచముఖ హనుమాన్ ఆలయానికి ఆటంకం కలుగకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అభివృద్ధికి ప్రజలు సహకరించాలని, రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న కులాయి గుంతలు, షెడ్లు ప్రజలే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరారు.
షబ్బీర్ అలీ ఇల్లు కూడా..
అయితే ఎమ్మెల్యే ఇంటి నుంచి పాత బస్టాండ్ వరకు విస్తరించే రోడ్డు మార్గంలోనే ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇల్లు కూడా ఉంది. దీంతో ఆయన ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న రోడ్డుకు అదనంగా మరో 24 ఫీట్లు కలిపి కొత్త రోడ్డు నిర్మించాలని అధికారులకు సూచించారు.