Seethakka And Konda Surekha Meet KCR: రాజకీయాలు ఒక పరిధి వరకే బాగుంటాయి. ఆ ఆ తర్వాత కొనసాగించాల్సింది మానవ సంబంధాలనే. కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో మానవ సంబంధాలు మరుగున పడిపోయి.. రాజకీయాలు స్వైరవిహారం చేస్తున్నాయి. మానవ సంబంధాలను మర్చిపోయిన రాజకీయ నాయకులు.. తమ రాజకీయం కోసం మనుషుల మధ్య ఉన్న సంబంధాలను సైతం వాడుకుంటున్నారు. ఇక బూతుల విషయంలో అయితే సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లోకి లాగుతూ.. సామాన్య ప్రజలకు రాజకీయాలు అంటేనే ఇబ్బంది కలిగించే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
ఇటువంటి రాజకీయాలు ఎంత మాత్రం తెలంగాణ సమాజానికి శ్రేయస్కరం కాదు. అయితే ఇన్ని రోజులకు తెలంగాణ రాష్ట్రంలో ఒక శుభ పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష నాయకుడి వద్దకు మంత్రులు వెళ్లారు. త్వరలో జరగబోయే మేడారం సమ్మక్క సారక్క జాతరకు ఆహ్వానించారు. ఈ ఘట్టానికి ఎర్రవల్లి వేదిక అయింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్నాయి..
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కొనసాగుతున్నారు. అయినప్పటికీ ఆయన శాసనసభకు అంతగా హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన పాలమూరు రంగారెడ్డి పథకంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం తోలు తీస్తామని హెచ్చరించారు. అయితే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ వెంటనే వెళ్లిపోయారు. దీనిపై అటు కాంగ్రెస్, ఇటు భారత రాష్ట్ర సమితి మధ్య తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగాయి. ఈ వాతావరణం ఇలా కొనసాగుతుండగానే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి సంప్రదాయానికి తెర తీసింది..
మేడారం జాతర త్వరలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఎర్రవల్లిలోని కెసిఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. అక్కడ ఆయనకు మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందించారు. ఇంటికి వచ్చిన మహిళా మంత్రులకు కేసీఆర్ సతీమణి శోభ చీర, గాజులు, పసుపు కుంకుమ పెట్టి తెలంగాణ సంప్రదాయాన్ని ప్రదర్శించారు.
వాస్తవానికి ఇటువంటి సంప్రదాయానికి తెలంగాణ గడ్డ ప్రతీక. రాజకీయాలు ఇవాళ ఉండొచ్చు. పదవులు వస్తూ ఉండొచ్చు. కానీ అవి ఎప్పటికీ శాశ్వతం కాదు. రాజకీయ నాయకులు ఈ విషయాన్ని మర్చిపోయి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని.. గులాబీ పార్టీ ఒప్పుచేసిందని చెప్పడం లేదు. ఈ రెండు పార్టీల అధినేతలు.. కీలక నాయకులు రాజకీయాలను నాశనం చేసినవారే. తమ బూతులతో బ్రష్టం పట్టించిన వారే. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని, సుహృద్భావ వాతావరణానికి శ్రీకారం చుట్టడం గొప్ప విషయం.