Komatireddy Venkat Reddy: పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకవైపు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్‌ఎస్ నాయకులను టెన్షన్ పెడుతోంది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి పార్టీ సత్తా చాటాలని భావిస్తున్న బీఆర్‌ఎస్ తాజాగా రైతుల అంశాన్ని భుజానికి ఎత్తుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నీరందక పంటలు ఎండుతుండడంతో ఇదే అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించి ఎండుతున్న పంటలను పరిశీలించారు. రైతులను పరామర్శించారు. కాంగ్రెస్ అసమర్థ పాలన కారణంగానే తెలంగాణలో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇది వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని ఆరోపించారు. వేసవిలో తాగునీటి సమస్య కూడా వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ వైఫల్యం ఎంత..
కేసీఆర్ ఆరోపణలతో ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్లే కనిపిస్తోంది. కాళేశ్వరం కుంగిన తర్వాత కూడా అందులో నీరు నిల్వ ఉంది. డ్యామ్‌సేఫ్టీ అధారిటీ కూడా మొదట ఖాళీ చేయమని ఆదేశించలేదు. అయితే అప్పటికే యాసంగి పంటల సాగు మొదలైంది. కానీ, అధికార కాంగ్రెస్ బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పెట్టిన శ్రద్ధ ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడంపై పెట్టలేదు.
నాడు లిఫ్ట్ చేసి ఉంటే..
ఫిబ్రవరిలో అన్నారం బ్యారేజీలో మరోమారు బుంగలు ఏర్పడడంతో డ్యాం సేఫ్టీ అథారిటీకి ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. స్పందించిన అధికారులు వెంటనే బ్యారేజీలను ఖాళీ చేయాలని సూచించారు. ఆ సూచనలన మేరకు అన్నారం. సుందిళ్ల బ్యారేజీల గేట్లు ఎత్తి నీటిని కిందకు వదిలారు. అప్పటి వరకు బ్యారేజీల్లో సగటున 5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నీటిని కిందికి వదలకుండా సుందిళ్ల పంప్‌హౌస్ ద్వారా లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ ఎస్సారెస్పీ, మిడ్‌మానేరు, మల్లన్నసాగర్ తదితర రిజర్వాయర్లు నింపి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు.
ముందు చూపు లేకపోవడంతో..
కాంగ్రెస్ సర్కార్‌కు ముందు చూపు లేకపోవడం, నీటి వనరుల సద్వినియోగంపై అవగాహన లేకపోవడంతో ఉన్న నీటిని కిందకు వదిలేసి ఇప్పుడు కేసీఆర్ పాపాల కారణంగానే వర్షాలు పడలేదని, కరువుకు కారణం బీఆర్‌ఎస్ అన్నట్లు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కౌంటర్ ఎటాక్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కాళేశ్వరంలో లోపాలపైనే ఫోక్ చేశారు తప్ప ఏనాడూ నీటిని లిఫ్ట్ చేయడంపై ఆలోచన చేయలేదు.
కేసీఆర్ పాపాలే వానలకు అడ్డంకి..
ఇక తాజాగా మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పందించారు. తెలంగాణలో కరువుకు కేసీఆర్ పాపాలే కారణమన్నారు. ఆయన చేసిన పాపాలు తెలంగాణకు శాపాలుగా మారాయని ఆరోపించారు. దీనిని చూసి తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎవరి పాపం వారికే అనేది సామెత. కానీ కోమటిరెడ్డి మాత్రం కేసీఆర్ పాపం తెలంగాణ అంతటికీ తగులుతుందని అతిశయోక్తి ఆరోపణలు చేయడం నవ్వు తెప్పిస్తోంది. తాము చేయాల్సిన పనులు చేయకుండా వాస్తవాలను కప్పి పుచ్చుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.