Lok Sabha Election 2024: తెలంగాణలోని లోక్ సభ స్థానాల్లో హాట్ సీట్ మెదక్. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 16 స్థానాల్లో పోలింగ్ ముందు తర్వాత పరిస్థితులపై అన్ని సర్వే సంస్థలు,ప్రసార మాధ్యమాలు ఓ అంచనాను వెలిబుచ్చాయి. కానీ,మెదక్ లోక్ సభ సెగ్మెంట్ పై మాత్రం ఒక స్పష్టతనివ్వలేకపోయాయి. ఇక్కడ త్రిముఖ పోటీ ఉందని ఎవరు గెలుస్తారో చెప్పలేమనే అభిప్రాయాన్ని వెలిబుచ్చాయి. అయితే సర్వే సంస్థలు చెప్పినట్లు ఇక్కడ త్రిముఖ పోరు ఉన్నప్పటికీ గులాబీ వికసించే ఛాన్సెసే మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ పూర్తైన తర్వాత తోతుగా కసరత్తు చేసిన మెజార్టీ రాజకీయ విశ్లేషకులు,ఆయా పార్టీల నేతలూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మెదక్ గడ్డపై అటు కాంగ్రెస్ కానీ..ఇటు బీజేపీ జెండా కానీ..ఎగిరే పరిస్థితులు లేవని తెలుస్తోంది.
మెదక్ సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఈ నియోజకవర్గ పరిధిలోనే బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహించే గజ్వేల్,మాజీ మంత్రి హరీశ్ రావు ప్రాతినిథ్యం వహించే సిద్దిపేట నియోజకవర్గాలున్నాయి. ఈనేపథ్యంలోనే మెదక్ నియోజకవర్గాన్ని మొదటి నుంచి బీఆర్ఎస్ చాలా ప్రతిష్టాత్మకం గా తీసుకుంటూ వస్తోంది. మెదక్ గడ్డపై మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలనే గట్టి పట్టుదలతో ఆ పార్టీ క్యాడర్ పనిచేసింది. అందుకే ఆర్థికంగా చాలా బలీయమైన అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని బరిలో నిలిపింది ఆపార్టీ అధినాయకత్వం. ఇక మరోవైపు ఈ సెగ్మెంట్ ను ఎలాగైనా గెలుచుకోవాలని బీఆర్ఎస్ కు బలమైన పట్టున్న మెదక్ ను చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ కూడా గట్టి ప్రయత్నాలే చేసింది. అటు బీజేపీ కూడా ఈసెగ్మెంట్‌పై గంపెడాశలే పెట్టుకుంది. బీజేపీ తరపున చరిష్మా కల్గిన నాయకులు రఘునందన్ రావు బరిలో ఉండడం,దేశ వ్యాప్తంగా మోడీ మానియా కొనసాగుతుండడంతో..భాజపా కూడా ఈ సెగ్మెంట్‌పై గట్టి ఆశలే పెట్టుకుంది. వెరసి మెదక్ పొలిటికల్ గా చాలా హాట్ హాట్ గా మారింది.
మెదక్ లోక్ సభ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లుంటే అందులో గత శాసన సభ ఎన్నికల్లో 6 స్థానాలను బీఆర్ఎసే గెలుచుకుంది. ఒక్క మెదక్ అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగల్గింది. ఇది కాస్తా ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కాస్తా మైనస్‌గా మారినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సంగారెడ్డి,పటాన్ చెర్వ్‌లలో కాంగ్రెస్ కు కాస్తా మెజార్టీ ఓట్లు పోలైనట్లు అన్ని పార్టీల నేతలు అంగీకరిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ వ్యతిరేక మొత్తం ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మళ్లించుకోవడంలో ఆ పార్టీ ఇక్కడ విఫలం అయినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీ,కాంగ్రెస్‌ల మధ్య చీలిపోయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అదే టైంలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చెక్కుచెదరకుండా ఆ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి పోలవడం ప్లస్ పాయింట్ గా మారినట్లు సమాచారం. దీంతో పాటు బీఆర్ఎస్‌కు మొదటి నుంచి సిద్దిపేట జిల్లా కంచుకోటగా ఉంటూ వస్తోంది. అందులోనూ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం మొదటి నుంచి మెదక్ లోక్ సభ అభ్యర్థిగా పార్టీ తరపున నిలబడే వారికి భారీ లీడ్ ను ఇస్తోంది. ఈనేపథ్యంలోనే వెంకట్రామిరెడ్డికి సిద్దిపేట నియోజకవర్గంలో భారీ పోలింగ్ నమోదు అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
గతంలో ఒకసారి మెదక్ పార్లమెంట్ కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చాగండ్ల నరేంద్ర నాథ్ కొద్ది మెజార్టీతో ఓడిపోయారు. మొత్తం ఏడు సెగ్మెంట్లలో 5 నియోజకవర్గాల్లో నరేంద్ర నాథ్ ఆధిక్యతను ప్రదర్శించారు. మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ పూర్తి అయ్యేసరికి ఆయన సుమారు 60 వేల లీడ్ ను కొనసాగించారు. అయితే సిద్దిపేట కౌంటింగ్ కంప్లింట్ అయ్యేసరికి బీఆర్ఎస్ తరపున ఎంపీగా బరిలో ఉన్న విజయ శాంతి అనూహ్య చివరకు సుమారు 6 వేల ఓట్ల ఆధిక్యతంతో విజయం సాధించారు. అందువల్ల ఈసారి సంగారెడ్డి,పటాన్ చెర్వ్ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ కు మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ..సిద్దిపేట ప్రభావం,బీజేపీ ఓట్ల చీలికతో చివరకు బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డినే విజయం సాధించొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.