AP Elections 2024: ఓటర్లను కొట్టడం వైసీపీ బాగా మైనస్ అయ్యిందా?

తెనాలి నియోజకవర్గంలో సుధాకర్‌ అనే ఓటరుపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్‌ చేయి చేసుకున్నాడు. పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన శివకుమార్‌కూ క్యూలైన్‌లో వచ్చి ఓటు వేయమని సూధాకర్‌ సూచించాడు.

Written By: Raj Shekar, Updated On : May 14, 2024 11:29 am

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ తిరుగుతూ.. చేతులు జోడించి మొక్కుతూ మీరే మా దేవుళ్లు.. మేము మీ సేవకులం.. మాకు ఓటు వేసి మీకు సేవ చేసే భాగ్యం కల్పిచండి అంటూ ఓటర్ల కాళ్లు, చేతులు, గడ్డాలు పట్టుకున్న ఏపీలోని అధికార వైసీపీ నాయకులు.. చివరకు పోలింగ్‌ రోజు ఓటరు దేవుళ్లపైనే దౌర్జన్యకాండ సాగించారు. దేవుళ్లని పొగిడిన నేతలకు ఓటర్లు ఎన్నికల సమయంలో దెయ్యాలుగా మారినట్లు కనిపించారు. దీంతో ఓటర్లపై దాడులకు తెగబడ్డారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తెనాలిలో ఓటరుపై దాడి..
తెనాలి నియోజకవర్గంలో సుధాకర్‌ అనే ఓటరుపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్‌ చేయి చేసుకున్నాడు. పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన శివకుమార్‌కూ క్యూలైన్‌లో వచ్చి ఓటు వేయమని సూధాకర్‌ సూచించాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్‌ చెంప చెల్లుమనిపించాడు. దీంతో బాధితుడు కూడా ఎమ్మెల్యేపై చేసుకున్నాడు. వెంటనే ఎమ్మెల్యే అనుచరులు సుధాకర్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. తనపై అకారణంగా చేయి చేసుకున్నందుకే ఎమ్మెల్యేపై తాను చేయి చేసుకున్నానని సుధాకర్‌ తెలిపాడు. ఎమ్మెల్యే అనుచరులు తనను చంపుతానని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఓటు వేసేందుకు బెంగళూరు నుంచి వస్తే ఇలా అవమానించారని పేర్కొన్నాడు.

రాష్ట్రవ్యాప్తంగా చర్చ..
సుధాకర్‌పై వైసీపీ అభ్యర్థి దాడి చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ విషయం ఈసీ దృష్టికి వెళ్లడంతో శివకుమార్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేయాలని ఆదేశించింది. అయతే ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్‌ కూడా స్పందించారు. దాడిని సమర్థించేకునేందుకు సుధాకర్‌ తాగొచ్చి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, తనను కూడా దూషించాడని ఆరోపించాడు. ఈ కారణంగానే తాను చేయి చేసుకున్నాని తెలిపాడు. కులాలు, మతాలను తీసొకొచ్చి లబ్ధి పొందే ప్రయత్నం చేశాడు.

జోగి రమేశ్‌ కొడుకు..
ఇదిలా ఉంటే.. పెనమలూరు నియోజకవర్గంలోని పోలింగ్‌ కేంద్రంలో కూడా మంత్రి జోగి రమేశ్‌ కొడుకు జోగి రాజీవ్‌ కూడా వీరంగం సృష్టించాడు. కుర్చీలను విసిరేస్తూ..పోలింగ్‌ ను ఆపేయాలంటూ పోలింగ్‌ సిబ్బందిపై దాడిచేశాడు. రాష్ట్రంలో వైసీపీ నేతలు దాడులకు తెగబడడంతో విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఓటర్లను భయపెట్టాలని చూస్తున్నారని, పోలింగ్‌ శాతం తగ్గేలా చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలపై చర్య తీసుకోవాలని ఈసీకి లేఖ రాశారు.