CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. జూలై 22న ప్రారంభమైన సమావేశాలను మొదట 9 రోజులు(జూలై 31) వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. తర్వాత మరో రెండు రోజులు పొడిగించారు. ఆగస్టు 2(శుక్రవారం)తో సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో 2024–25 పూర్తి బడ్జెట్‌తోపాటు అనేక బిల్లులను ప్రవేశపెట్టారు. బిల్లులపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ దద్దరిల్లుతోంది. సభకు ఆటంకం కలిగించేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎంత ప్రయత్నించినా.. స్పీకర్ మాత్రం వారిని సస్పెండ్ చేయడం లేదు. ప్రభుత్వం కూడా సస్పెండ్ చేయకుండా టార్గెట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ సభకు రాకపోవడాన్ని రేవంత్‌రెడ్డి ప్రతీ సందర్భంలోనూ ప్రస్తావిస్తూ విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్‌తోపాటు, కేటీఆర్, హరీశ్‌రావు లక్ష్యంగానే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మంత్రులు, డిప్యూటీ సీఎం, సీఎం అందరూ విరుచుకుపడ్డారు. ఈ విషయంపై బీఆర్‌ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈమేరకు ఆగస్టు 1న రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేయగా, ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీలో ఆందోళన చేశారు. అసెంబ్లీ లాబీలో ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు ధర్నా చేశారు. దీంతో స్పీకర్ వారిని బయటకు తీసుకెళ్లాలని మార్షల్స్‌కు సూచించారు. దీంతో మార్షల్స్ కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు ఎమ్మెల్యేలను ఎత్తుకుని అసెంబ్లీ బయటకు తీసుకెళ్లారు.
వాయిదా తీర్మానం తిరస్కరణ...
అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై ముందుగా బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. దానిపై చర్చకు పట్టుపట్టింది. స్పీకర్ తిరస్కరించడంతో సభలో మహిళా సభ్యులను అవమానించారని.. సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ మాత్రం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. సుప్రీకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పుపై మాత్రమే మాట్లాడితేనే మైక్ ఇస్తాననడంతో సభలో గందరగోళం నెలకొంది.
బీఆర్‌ఎస్ నినాదాలు..
ఇదే సమయంలో సభలో బీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళా సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు ధర్నాకు దిగారు. దీంతో అక్కడికి మార్షల్స్ చీఫ్ మార్షల్ ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను బయటికి ఎత్తుకెళ్లారు. కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు మిగతా ఎమ్మెల్యేలను బయటికి తీసుకురాగా, అక్కడ కూడా నిరసనకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మహిళలకు గౌరవం ఇవ్వడం లేదన్నారు. మహిళలను సభలోనే అవమానిస్తోందని ఆరోపించారు.
ఘాటుగా స్పందించిన సీఎం..
ఇదిలా ఉంటే.. సభలో బీఆర్‌ఎస్ ఆందోళనపై సీఎం రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. తనను నమ్ముకున్నవారు మంత్రులు అయ్యారని, ఆ తమ్ముడు(కేటీఆర్)ను నమ్ముకున్నవారు పదవులకు దూరమయ్యారని విమర్శించారు. సొంత చెల్లి జైల్లో ఉన్నా మాట్లాడడం లేదని కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను మహిళను గౌరవిస్తానని, ఇప్పటికీ సబితా ఇంద్రారెడ్డిని అక్కగానే భావిస్తున్నట్లు తెలిపారు.