Annadata Sukhibhava Scheme : ఖరీఫ్ ముగిస్తున్నా కానరాని సాగు ప్రోత్సాహం..అన్నదాత సుఖీభవ’ పథకం ఎప్పుడు చంద్రబాబు?

సాగు పెట్టుబడులు అధికమయ్యాయి. చేతిలో నగదు ఉంచుకొని పనులు ప్రారంభించాలి. కానీ ప్రభుత్వం నుంచి ఆశించిన సాగు ప్రోత్సాహం ఇంతవరకు అందలేదు. రెట్టింపు సాయం అందిస్తానని చెప్పిన చంద్రబాబు పట్టించుకోవడం లేదు.

Written By: Dharma, Updated On : August 2, 2024 1:44 pm
Follow us on

Annadata Sukhibhava Scheme : ఖరీఫ్ ముగుస్తోంది. రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అధికంగా ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఏటా ఈ సమయానికి ప్రభుత్వం నుంచి సాగు సాయం అందేది. రైతు భరోసా పేరిట ఐదు సంవత్సరాలుగా వైసీపీ సర్కార్ సాయం అందించింది. కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6000 తో కలుపుకొని.. రూ.13,500 అందిస్తూ వచ్చింది. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు జగన్ ఏటా.. సాగు ప్రోత్సాహం కింద రైతులకు పదిహేను వేల రూపాయలు సాయం అందిస్తానని ప్రకటించారు. కేంద్రంతో పని లేకుండా ఈ మొత్తాన్ని అందిస్తానని చెప్పుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద 6000 రూపాయలతో కలుపుకొని.. మరో రూ.7500 మాత్రమే ఇచ్చారు. అయితే జగన్ సర్కార్ గత ఐదేళ్లుగా రైతులను మోసం చేసిందని.. తాము అధికారంలోకి వస్తే ఏటా సాగు సాయం కింద 20వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు గడుస్తున్నా.. ఈ పథకానికి ఎటువంటి కసరత్తు జరగడం లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం పేరును అన్నదాత సుఖీభవగా మార్చారు. వెబ్ సైట్ లో సైతం మార్పులు చేశారు. దీంతో పథకం త్వరలో అమలు చేస్తారని అంతా భావించారు. కానీ ఇంతవరకు స్పష్టమైన ప్రకటన లేదు. మరోవైపు చూస్తుంటే ఖరీఫ్ మధ్యలో ఉంది. మరో నెల రోజుల్లో ముగుస్తుంది. ఎప్పుడు అమలు చేస్తారంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు.

* ఆ ప్రకటనలతో ఆందోళన
ఇటీవల చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. వైసీపీ సర్కార్ ఏపీని అప్పుల కుప్పగా మార్చేసిందని చెప్పుకొస్తున్నారు. శ్వేత పత్రాలు విడుదల చేసి గణాంకాలతో సహా వివరిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకున్న ప్రజలు నీరుగారి పోతున్నారు. పథకాలను అమలు చేస్తారా? లేదా? అంటూ ఆందోళన చెందుతున్నారు.

* అందని రుణాలు
సాగు పెట్టుబడి అందకపోగా.. బ్యాంకుల నుంచి రుణాలు సైతం ఆశించిన స్థాయిలో దక్కడం లేదు. ఏటా ఈ సమయానికి బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చేవి. రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ నిధులు పడేవి. దీంతో సాగు పెట్టుబడి కొంతవరకు సమకూరేది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. అన్నదాత సుఖీభవ అంటూ పథకం పేరు మార్చి ఊరుకుంది కూటమి ప్రభుత్వం. కనీసం దాని గురించి ప్రస్తావన లేదు. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు. మరోవైపు సెప్టెంబర్ రెండోవారంతో ఖరీఫ్ సీజన్ ముగుస్తుంది. దీంతో అప్పటికే రైతులు అన్ని విధాలుగా పెట్టుబడులు పెట్టుకుంటారు.ప్రభుత్వం నుంచి సాయం లేకపోవడంతో రైతులు ప్రైవేటు దళారుల వద్ద, వ్యాపారుల వద్ద అప్పులు చేశారు.

* ఓటాన్ బడ్జెట్ తో అనుమానం
అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. స్వల్ప కాలానికి సంబంధించి ఈ బడ్జెట్ కొనసాగనుంది. ప్రభుత్వ ఆదాయ వ్యయాల గురించి ఒక అంచనాకు రానుంది. అందుకు అనుగుణంగా సంక్షేమ పథకాలను అమలు చేయనుంది.ఈ లెక్కన వచ్చే జనవరి తరువాత రబీ సీజన్ కు అన్నదాత సుఖీభవ మొత్తాన్ని వేయనుంది. సంక్రాంతి తర్వాతే సాగు ప్రోత్సాహం అందే అవకాశం ఉందని అధికార వర్గాలు సైతం చెబుతున్నాయి.