Organic Food: ఔరా.. ఆర్గానిక్‌ విందు.. పెళ్లి భోజనం తిని అతిథుల ఆశ్చర్యం

ఒకప్పుడు పెళ్లి భోజనం అంటే పప్పన్నం.. ఇప్పటికీ చాలా మంది పెళ్లికాని అబ్బాయిలు లేదా అమ్మాయిలను పప్పన్నం ఎప్పుడు పెడతావ్‌ అని అడుగుతారు.

Written By: Raj Shekar, Updated On : April 1, 2024 12:14 pm

Marriage lunch arrangements with organic food items

Follow us on

Organic Food: ఆర్గానిక్‌ విందు.. ఇదేంటి ఎక్కడ వినలేదు.. విందు అంటే మటన్, చికెన్ లాంటి నాన్‌వెజ్‌.. లేదా పప్పన్నం కదా అనుకుంటున్నారా.. కానీ మీరు విన్నది నిజమే మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఆర్గానిక్‌ విందు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇదే భోజనంపై తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అందరూ ఆ భోజనం గురించే మాట్లాడుకుంటున్నారు.

మారిన పెళ్లి తీరు..
ఒకప్పుడు పెళ్లి భోజనం అంటే పప్పన్నం.. ఇప్పటికీ చాలా మంది పెళ్లికాని అబ్బాయిలు లేదా అమ్మాయిలను పప్పన్నం ఎప్పుడు పెడతావ్‌ అని అడుగుతారు. అయితే మారిన పెళ్లి తీరుతో ఆధునిక వివాహంలో హంగులు, ఆర్భాటాలు.. పసందైన విందులు ఇలా రకరకాలుగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. అందరిలా పెళ్లి చేస్తే వెరైటీ ఏముంటుందని కొందరు వినూత్నంగా కూడా ఆలోచిస్తున్నారు. సెలబ్రేషన్స్‌లో కొంత మంది హైటెక్‌ హంగులు జోడిస్తే కొందరు పాత కాల సంప్రదాయాలను పాటిస్తున్నారు.

ఆర్గానిక్‌ ఫుడ్‌తో..
ఇక మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఏనుగొండలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఏర్పాటు చేసిన భోజనం ఇప్పుడు ప్రత్యేకంగా నిలిచింది. సంతోష్‌ నగర్‌ కాలనీకి చెందిన ఉమామహేశ్వరి రాజనర్సింహాశెట్టి దంపతులు తమ కుమార్తె పెళ్లిలో అతిథులకు, బంధువు మిత్రులకు అందరికీ ఆర్గానిక్‌ వంటలు వడ్డించారు. వాటి రుచి చూసిన పెళ్లివారు ఆశ్చర్యపోయారు. ఇక పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కూడా ప్లాస్టిక్‌తో కాకుండా వస్త్రంపై వధూవరుల చిత్రాలతో తయారు చేయించారు.

అనారోగ్య సమస్యతో ఆర్గానిక్‌ బాట..
రాజనర్సింహాశెట్టి విద్యుత్‌ కాంట్రాక్టర్‌. ఆయన భార్య ఉమామహేశ్వరి బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతోంది. వీరికి నలుగురు సంతానం. అందరూ ఆడపిల్లలే. పెద్ద బిడ్డ కూతురు అనారోగ్యంతో బాధపడుతోంది. పలువురి సూచనల మేరకు రాజనర్సింహాశెట్టి కుటుంబం ఆర్గానిక్‌ ఆహారంవైపు మళ్లింది. ఇప్పుడు కుటుంబం మొత్తం ఆర్గానిక్‌ పద్ధతిలో పండించిన కూరగాయలు, బియ్యం ఆహారంగా తీసుకుంటున్నారు.

అందరికీ అవగాహన కల్పించాలని..
ఈ క్రమంలో సేంద్రియ ఉత్పత్తులపై మరింత మందికి రాజనర్సింహాశెట్టి అవగాహన కల్పిస్తున్నారు. కూతురు పెళ్లి ద్వారా ఎక్కువ మందికి అవేర్నెస్‌ తీసుకురావడానికి నాలుగో కూతురు వివాహానికి హాజరైన వారికి విందుభోజనం పూర్తిగా సేంద్రీయ వంటకాలతో వడ్డించారు. సుమారు 2,500 మందికి సేంద్రియ వంటకాలతో భోజనం ఏర్పాటు చేశారు.

వంటకాలు ఇవీ..
ఇక పెళ్లిలో మైసూర్‌ మల్లిగ బియ్యం, బ్లాక్‌ రైస్‌తో స్వీట్లు చేయించారు. అతిథులకు బాస్మతి రైస్‌తో వెజిటేబుల్‌ బిర్యానీ, నవారా బియ్యంతో పెరుగన్నం, స్వచ్ఛమైన నెయ్యి, దేశీ ఆవు పాలు, పెరుగుతో అరటి ఆకులో భోజనాలు వడ్డించారు. వీటిని తమిళనాడు, నాగర్‌కర్నూల్‌ జిల్లా ఓ మహిళా రైతుతోపాటు పలువురి నుంచి గో ఆధారిత సేంద్రియ బియ్యం, పప్పు ధాన్యాలు, ఇతర సామగ్రితో వంటకాలు చేయించారు.