Vangaveeti Radha : వంగవీటి రాధాకృష్ణ పరిస్థితి ఏంటి? టిడిపి తరఫున ప్రచారం చేస్తారా? స్టార్ క్యాంపెయినర్ అవుతారా? ఆయనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? లేకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికలకు ముందు టిడిపిలో చేరిన రాధ ఆ పార్టీకి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. కానీ టిడిపి అధికారంలోకి రాలేదు. అలాగని రాధా వేరే పార్టీలో చేరలేదు. ఇటీవల నారా లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో రాధా టీడీపీలో యాక్టివ్ అవుతారని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన ఆశిస్తున్న విజయవాడ నగరంలోని మూడు సీట్లకు కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. జనసేన సైతం అభ్యర్థులను ప్రకటించింది. దీంతో ప్రత్యక్ష ఎన్నికల్లో రాధా పోటీ చేసే అవకాశం లేదని తేలిపోయింది.
2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాధ ఘనవిజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి.. ఆ పార్టీ అభ్యర్థిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రెండోసారి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2014లో వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా మరోసారి అదే తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఓటమి ఎదురైంది. గత ఎన్నికల్లో మాత్రం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీటును ఆశించారు. కానీ జగన్ కేటాయించలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన టిడిపిలోకి వచ్చారు. కానీ పోటీ చేసే ఛాన్స్ దక్కలేదు. ఈ ఎన్నికల్లో ఆయన పేరును పరిగణలోకి తీసుకుంటారని భావించారు. కానీ ఎందుకో చంద్రబాబు పక్కన పెట్టారు.
టిడిపిలో ఛాన్స్ లేకపోవడంతో రాధాకృష్ణ జనసేన లో చేరతారని ప్రచారం జరిగింది. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ ను కలవడం, చర్చలు జరపడంతో ఈ అనుమానాలకు బలం చేకూరాయి. అటు తరువాత మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరిని సైతం వంగవీటి రాధా కలిశారు. అదే సమయంలో జనసేన బాలశౌరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు. అప్పటికే అవనిగడ్డలో సైతం జనసేన అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో మచిలీపట్నం ఎంపీ సీటు అయినా.. అవనిగడ్డ అసెంబ్లీ సీటును అయినా రాధాకు ఇస్తారని ప్రచారం సాగింది. అయితే రెండు రోజుల కిందట మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి పేరును ప్రకటించారు. అటు అవనిగడ్డ విషయంలో ముగ్గురు అభ్యర్థులతో ఐవిఆర్ఎస్ సర్వే చేపడుతున్నారు. అందులో రాధా పేరు లేదు. మరోవైపు టిడిపి ఇన్చార్జ్ మండలి బుద్ధ ప్రసాద్ ను జనసేన లోకి రప్పించి టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.
ఈ పరిణామాల క్రమంలో వంగవీటి రాధాకృష్ణ పేరును అటు టిడిపి, ఇటు జనసేన పరిగణలోకి తీసుకోకపోవడం వెనుక కొడాలి నాని, వల్లభనేని వంశీ ఉన్నారన్నది ఒక ప్రచారం జరుగుతోంది. ఆ ముగ్గురు స్నేహితులు. కానీ వారు చంద్రబాబుతో పాటు పవన్ ను టార్గెట్ చేసుకునే విధానం అభ్యంతరకరంగా ఉంటుంది. కానీ వారిని నిలువరించడంలో, వారి వ్యాఖ్యలను ఖండించడానికి ఎప్పుడూ రాధాకృష్ణ ముందుకు రాలేదు. ఈ కారణంగానే వంగవీటి రాధాకు ఆ రెండు పార్టీలు దూరం పెట్టినట్లు తెలుస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంగవీటి రాధాకు ఏదో ఒక పదవి ఇస్తారని.. ఎన్నికల ప్రచార సభల్లో రాధా పాల్గొనే అవకాశం ఉందని మరో ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.