AP Volunteers : సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఏపీపై ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా వాలంటీర్లపై ఆంక్షలు విధిస్తోంది. సంక్షేమ పథకాల పంపిణీ, ఓటర్లతో ప్రత్యేక సంబంధాలు ఉన్న వాలంటీర్లు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల మూడున ఇవ్వాల్సిన పింఛన్లను వాలంటీర్లు ఇవ్వొద్దని.. పంచాయతీ కార్యాలయంలో పింఛన్లను పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించింది. వాలంటీర్ల వద్ద ఉన్న ప్రభుత్వ ట్యాబులు, డేటా, ఇతర డాక్యుమెంట్లను గ్రామ సచివాలయంలో అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అయితే అక్కడకు కొద్ది గంటలకే వాలంటీర్లకు ఈసీ మరో షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రేషన్ పంపిణీ లోను వాలంటీర్లు పాల్గొనవద్దని ఆదేశించింది. వారి స్థానంలో విఆర్వోలు మ్యాపింగ్ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ఎం డి యు ఆపరేటర్లు కూడా వాలంటీర్లను రేషన్ పంపిణీ కార్యక్రమానికి పిలవకూడదని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో వరుసగా వాలంటీర్లకు షాక్ లు తగులుతూనే ఉన్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ను నియమించిన సంగతి తెలిసిందే. వీరు ఈ 50 కుటుంబాల పరిధిలో సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవలు పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు. పేరుకే వాలంటీర్లు అయినా వీరు అధికార పార్టీ సానుభూతిపరులు అన్నది బహిరంగ రహస్యం. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లో వాలంటీర్ల సహకారంతోనే వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది అన్నది ప్రచారంగా ఉంది. అటు విపక్షాలు సైతం వాలంటీర్ వ్యవస్థ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాయి. ఈ ఎన్నికల్లో తప్పకుండా వారు ప్రభావం చూపుతారని భయపడ్డాయి. అందుకే ఎలక్షన్ కమిషన్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో వాలంటీర్లకు వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది.