Husband and Wife: వారిది అన్యోన్య దాంపత్యం. ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లతో సాఫీగా సాగుతున్న వారి జీవితంలో రోడ్డు ప్రమాదం కల్లోలం నింపింది. భార్యను దూరం చేసింది. అయితే తాను ఎంతగానో ప్రేమించిన భార్య ఎడబాటును తట్టుకోలేక భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇద్దరు చిన్నారులను అనాథలుగా మిగిల్చాడు. నాన్నా.. నాన్నా అంటూ ఆ చిన్నారులు మారం చేస్తున్న తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ లోని రహ్మత్ నగర్ లో వెలుగుచూసింది. ఎస్పీఆర్ హిల్స్ లో నివాసముంటున్న సింప భరత్ కుమార్ (34) బీహెచ్ఈఎల్ ఆర్టీసీ డిపోలో భరత్ మెకానిక్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఏడేళ్ల కిందట మమత (30) అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆరేళ్ల విశాల్ అనే కుమారుడు, రెండేళ్ల సంయుక్త నిధి అనే కుమార్తె ఉన్నారు. హాయిగా జీవితం గడిచిపోతుందనుకున్న తరుణంలో భరత్ అనారోగ్యానికి గురికావడంతో కాస్తా కుదుపు ఏర్పడింది. కష్టాలను తెచ్చిపెట్టింది.

ఈ నేపథ్యంలో వైద్యసేవలు పొందాలని భరత్ భావించాడు. కొద్దిరోజుల పాటు ఉద్యోగానికి సెలవు తీసుకోవాలని నిర్ణయించారు. జనవరి 31న భార్య మమత, చిన్నారి సంయుక్త నిధితో కలిసి బీహెచ్ఈఎల్ ఆర్టీసీ డిపోకు బైక్ పై వెళ్లాడు. అక్కడ పని ముగించుకొని ఇంటికి వస్తుండగా ఎర్రగడ్ల ఫ్లైఓవర్ పై వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో మమత తలకు బలమైన గాయం తగిలి ఘటనాస్థలంలోనే మృతిచెందింది. భరత్ తో పాటు చిన్నారి స్వల్పగాయాలతో బయటపడ్డారు. అప్పటి నుంచి మనోవ్యధతో బాధపడుతున్న భరత్ పిల్లలిద్దర్ని చూసి తల్లడిల్లేవాడు. కుటుంబసభ్యలు ఓదార్చేవారు. ధైర్యం చెప్పేవారు.
అయితే ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన భరత్ మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. నివాసముంటున్న గదిలో ఫ్యాన్ కు చీర కట్టి ఉరిపోసుకున్నాడు. భరత్ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానించిన కుటుంబసభ్యలు తలుపును బలవంతంగా తెరిచిచూసేసరికి ఫ్యాన్ కు ఉరివేసుకొని కనిపించాడు. స్థానికులిచ్చిన సమాచారంతో 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అప్పటికే భరత్ మృతిచెందినట్టు ధ్రువీకరించారు. అటు ప్రమాదం రూపంలో తల్లి దూరం కావడం, తండ్రి బలవన్మరణానికి పాల్పడడం .. ఆ నేత మనసులను ఎంతో బాధించింది. నాన్న కోసం వారు మారం చేస్తున్నతీరు అక్కడున్న వారిని కలచివేసింది. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.