Jagan vs Chandrababu: రాష్ట్ర విభజన జరిగి దాదాపు 10 సంవత్సరాలు సమీపిస్తోంది. కానీ ఏపీలో పారిశ్రామిక పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహికులు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పారిశ్రామికాభివృద్ధి జరగలేదన్న అపవాదును మూటగట్టుకుంది. ఉన్న పరిశ్రమలు సైతం వైదొలిగేలా చేస్తోందన్న విమర్శలు జగన్ సర్కారుపై ఉన్నాయి. ఇటువంటి తరుణంలో విశాఖలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ పైనే అందరి దృష్టిపడింది. పారిశ్రామికవేత్తలను ఎంతవరకూ ఆకర్షించగలరన్న చర్చ సర్వత్రా నడుస్తోంది. అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ సూచికలో ఏపీ మెరుగైన ర్యాంకింగ్ ను సొంతం చేసుకుంటూ వస్తోంది. పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా ఏపీ ఉన్నా ఆ స్థాయిలో మాత్రం పరిశ్రమలు ఏర్పాటు కాలేదన్న విమర్శ ఉంది.

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సర్కారు విశాఖలో వరుసగా సీఐఐ సదస్సుల నిర్వహణతో భారీగానే పెట్టుబడులు ఆకర్షించారని గణాంకాలతో చెబుతున్నారు. ఇప్పుడు వాటిని జగన్ అధిగమించగలరా? అన్న ప్రశ్న అయితే ఉత్నన్నమవుతోంది. రాష్ట్ర విభజన తరువాత పెట్టుబడులు పెట్టే ఏకైక నగరంగా విశాఖ అవతరించింది. అటు అమరావతి రాజధానిగా ఉన్నా.. ఇప్పుడు మూడు రాజధానులు తెరపైకి వచ్చినా పారిశ్రామిక పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న ఏకైక నగరంగా విశాఖ నిలిచింది. గతంలో కేంద్ర ప్రభుత్వ సాయంతో విశాఖ నగరంలో మూడు సీఐఐ సదస్సులను చంద్రబాబు ఏర్పాటుచేశారు. కొన్నిరకాల పరిశ్రమల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని.. అందుకు ఒప్పందాలు కూడా పూర్తయ్యాయని ప్రకటించారు. ఇప్పుడు కేంద్ర సాయం లేకుండానే జగన్ సర్కారు ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఏర్పాటు చేస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పాలనను గాలికొదిలేసిందన్న విమర్శలున్నాయి. అటు పరిశ్రమల ఏర్పాటు కావడం లేదని.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదన్నది ప్రధాన ఆరోపణ. అందుకే ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ను జగన్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీనికిగాను భారీగా ఖర్చు చేస్తోంది. ప్రచార ఆర్భాటం కూడా చేస్తోంది. కర్టైన్ రైజర్ గా ఈవెంట్స్ ను సైతం ఏర్పాటుచేసింది. దిగ్గజ పారిశ్రామికవేత్తలను సైతం ఆహ్వానించింది. దావోస్ పారిశ్రామిక సదస్సుకు వెళ్లకపోవడంతో విమర్శలు చుట్టుముట్టాయి. మనమెందుకు దావోస్ వెళ్లడం.. దావోసే మన వద్దకు వస్తుందని ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. దీనిపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే పారిశ్రామికవేత్తలు పెట్టబడులకు ముందుకు రావడమే కాదు.. ఆన్ దీ స్పాట్ ఒప్పందాలు కూడా జరిగేలా జగన్ సర్కారు ప్లాన్ చేస్తోంది. తద్వారా పారిశ్రామికాభివృద్ధి విషయంలో గత నాలుగు సంవత్సరాలుగా వచ్చిన విమర్శలను చెక్ చెప్పాలని భావిస్తోంది.
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016, 17, 18లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు విశాఖ వేదికగా సీఐఐ సదస్సులు నిర్వహించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. దాదాపు రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ముందుకొచ్చాయని ప్రకటించారు. ఒప్పందాలు చేసుకున్నట్టు కూడా ప్రచారం చేసుకున్నారు. అయితే ఇందులో కొన్ని పరిశ్రమలను ఏర్పాటుచేశారు. మరికొన్ని ఏర్పాటవుతాయనగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని కల్పించడంలో జగన్ సర్కారు ఫెయిలైంది. దీంతో చాలా పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. అయితే తాజా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ఎన్ని పరిశ్రమలను ఆహ్వానిస్తారు? చంద్రబాబు కంటే ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించగలరా? లేదా? అన్నది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.