Malreddy Ranga Reddy: తెలంగాణలో 15 నెలలుగా ఊరిస్తున్న కేబినెట్ విస్తరణ(Cabinate Expansion) ఈసారి కచ్చితంగా ఉంటుందని అంతా భావించారు. అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్(Green Signal) ఇచ్చిందని చెప్పారు. కానీ, చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో మంత్రుల అవుతామనుకున్న నేతలు నిరాశలో ఉన్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యల చేశారు.
తెలంగాణలో కేబినెట్ విస్తరణ ప్రక్రియ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. సామాజిక వర్గాల సమతుల్యత సాధించడంలో అధిష్టానం చిక్కుముడుల్లో పడింది. వివిధ సామాజిక వర్గాల నుంచి మంత్రి పదవుల కోసం డిమాండ్లు పెరగడంతో ఎవరికి అవకాశం ఇవ్వాలన్న గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈసారి కచ్చితం అనుకున్న కేబినెట్ విస్తరణను అధిష్టానం తాత్కాలికంగా వాయిదా వేసింది. దీనికి కచ్చితమైన తేదీని కూడా నిర్ణయించలేదు. ఇదిలా ఉండగా, బీసీ రిజర్వేషన్ బిల్లు(BC resarvation bill)ను కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జరిగిన మహాధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), బీసీ మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే టీపీసీసీ(T PCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు.
పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం కేబినెట్‌లో ఇద్దరు బీసీ మంత్రులు ఉన్నారని, మరో ఇద్దరు బీసీ నేతలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి సూచించినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనపై హైకమాండ్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే, బీసీలకు అదనపు అవకాశాల కోసం ప్రయత్నాలు జరుగుతుండగా, రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా మంత్రి పదవుల కోసం ఒత్తిడి తీవ్రమవుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం(IbrahimPatnam) ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు. ఆయన గత కొంతకాలంగా ఈ విషయంపై పట్టుదలతో ఉన్నారు.
పదవి ఇవ్వకుంటే రాజీనామా..
తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, వేరే సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని పోటీ చేయించి గెలిపిస్తానని
మల్‌రెడ్డి రంగారెడ్డి(Malreddy Rangareddy) హెచ్చరించారు. ఆ తర్వాత ఆ నాయకుడికైనా జిల్లా నుంచి మంత్రి పదవి ఇస్తారా అని ప్రశ్నించారు. ఇటీవల సీనియర్ నేత జానారెడ్డి, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలని హైకమాండ్‌కు లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ నుంచి కేవలం మల్ రెడ్డి రంగారెడ్డి ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. రెడ్డి సామాజికవర్గంలో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో మల్‌రెడ్డి పేరు పరిశీలనలోకి రావడం లేదు. అయితే, జానారెడ్డి(Jana Reddy) ప్రస్తుతం ప్రభావశీలంగా కనిపిస్తుండటంతో, ఆయన సాయంతో మల్‌రెడ్డి మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రాజకీయ ఒత్తిళ్ల మధ్య కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది, ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది.