Malla Reddy brand expansion: దాదాపు 50 కి పైగా విద్యాలయాలు.. ఎల్కేజీ నుంచి మెడిసిన్ వరకు.. వేలాదిమంది ఉపాధ్యాయులు.. అంతకు మించిన సంఖ్యలో విద్యార్థులు.. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో లెక్కపెట్టలేనన్ని భవనాలు.. ఇవన్నీ కూడా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కి చెందినవే. టిడిపిలో రాజకీయ ప్రవేశం చేసిన ఆయన ప్రస్తుతం గులాబీ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన మీద ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ.. తన విద్యా వ్యాపారాన్ని మాత్రం ఆయన ఆపడం లేదు. పైగా మరింత దూకుడుగా కొనసాగించడానికి ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఇటీవల మల్లారెడ్డి విద్యాసంస్థలలో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మల్లారెడ్డి విద్యాలయాలు ప్రఖ్యాతమైన గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇదే విషయాన్ని మల్లారెడ్డి అత్యంత గొప్పగా చెప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ ను కూడా ఆహ్వానించారు.. అయితే ఇక్కడితోనే మల్లారెడ్డి ఆగడం లేదు. పైగా తన తరాన్ని కూడా విద్యా వ్యాపారంలోకి దింపారు. ప్రస్తుతం మల్లారెడ్డి విద్యా వ్యాపారాన్ని ఆయన కుమారులు, కోడళ్ళు చూసుకుంటున్నారు.. కేజీ నుంచి మొదలు పెడితే మెడికల్ కాలేజీ ల వరకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు అనేక హోదాలలో ఉన్నారు.. వాటి ఆర్థిక వ్యవహారాలు మొత్తం వారు చూసుకుంటున్నారు.
మల్లారెడ్డి తెలంగాణతోనే ఆగిపోవడం లేదు. దేశవ్యాప్తంగా తన బ్రాండ్ విస్తరించాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు.. అందువల్లే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టబోతున్నారు.. దేశవ్యాప్తంగా తన విద్యాసంస్థలను మరింతగా విస్తరించాలని కోరికతో తిరుపతి, విశాఖపట్నం నగరాలలో కాలేజీలను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.. అయితే ఈ కాలేజీలో కొనుగోలుకు ఆయన ఎంతవరకు ఖర్చు పెట్టారు అనే విషయాన్ని బయట పెట్టలేదు.. ఇటీవల ఆయన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తనని కలిసిన విలేకరులతో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. “నేను విద్యా వ్యాపారంలో ఉన్నాను. నాకు తెలంగాణలో విస్తారంగా కాలేజీలు ఉన్నాయి.. స్కూళ్ల నుంచి మొదలు పెడితే మెడికల్ కాలేజీల వరకు నాకు అన్ని రకాల విద్యాసంస్థలు ఉన్నాయి. మల్లారెడ్డి బ్రాండ్ మొత్తాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని నాకు బలమైన కోరిక ఉంది. అందువల్లే ఏపీ రాష్ట్రంలో కొన్ని కాలేజీలను కొనుగోలు చేశాను.. త్వరలోనే మల్లారెడ్డి పేరుతో ఇక్కడ కాలేజీలను నిర్వహిస్తాను. దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు స్థాపించి పేదలకు విద్య, వైద్యం అందిస్తాను.. ఇదే నాకు బలమైన కోరిక అని” మల్లారెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో మల్లారెడ్డి విద్యాసంస్థలు విస్తారంగా ఉన్నప్పటికీ.. ఆయన చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విద్యాలయాలపై చర్యలు తీసుకుంటుందని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ ప్రభుత్వం సైలెంట్ అయిపోయింది. మల్లారెడ్డి కూడా రేవంత్ రెడ్డి మీద ఎటువంటి విమర్శలు చేయడం లేదు.