HomeతెలంగాణKCR: కంటి చూపుతో శాసించే స్థాయి నుంచి.. కళ్ళ ముందు జరుగుతున్నా ఏం చేయలేని దుస్థితి.....

KCR: కంటి చూపుతో శాసించే స్థాయి నుంచి.. కళ్ళ ముందు జరుగుతున్నా ఏం చేయలేని దుస్థితి.. కెసిఆర్ కు ఎంత కష్టమొచ్చే?

KCR: పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ఎమ్మెల్సీ రాములు నాయక్ ని గెంటేశారు. కుంభకోణానికి పాల్పడ్డాడని అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి రాజయ్యను బర్తరఫ్ చేశారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు చేశారు. ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించారు.. పార్టీ లైన్ కి వ్యతిరేకంగా ఉన్నాడని బాబూ మోహన్ కు పొమ్మన లేక పొగ పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.. తనను, తన నాయకత్వాన్ని ధిక్కరించే ఏ వ్యక్తికైనా సరే కెసిఆర్ చుక్కలు చూపించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆట ఆడుకున్నారు. పార్టీలో ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే చర్యలకు ఉపక్రమించేవారు. ఎంతటి వారైనా సరే ఉపేక్షించేవారు కాదు. మరి ఇప్పుడు?

క్రమశిక్షణను పదేళ్లపాటు పకడ్బందీగా అమలు చేసిన కేసీఆర్.. ఇప్పుడు పార్టీపై పట్టు కోల్పోతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. నేతలు తమ వ్యవహార శైలితో లైన్ దాటుతున్నప్పటికీ కెసిఆర్ ఏమీ చేయలేకపోతున్నారు. జస్ట్ ఒక ప్రేక్షకుడిగా చూస్తుండి పోతున్నారు. అధికారం కోల్పోవడంతో కీలక నాయకులు మొత్తం కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఉన్న ఎమ్మెల్యేలలో కొంతమంది కండువా మార్చేందుకు సిద్ధంగా ఉన్నారు. తనకు అత్యంత సన్నిహితులైన నేతలు పార్టీ వీడుతుంటే.. కెసిఆర్ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్, రంజిత్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ వంటి వారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే.. కనీసం వారిని ఆపేందుకు కూడా కెసిఆర్ ప్రయత్నించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ఇవి ఇలా ఉండగానే.. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీ లైన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్, మాల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానాలపై భారత రాష్ట్ర సమితి భారీగా ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో.. మల్లారెడ్డి ఒక్కసారిగా తన వ్యాఖ్యలతో వాటిపై నీళ్లు చల్లాడు. మీడియా ప్రతినిధులు చూస్తుండగానే మల్కాజ్ గిరి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ ను ఆ లింగనం చేసుకున్నాడు. అంతేకాదు మల్కాజ్ గిరి స్థానంలో రాజేందర్ గెలుస్తున్నాడంటూ వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి అధికారంలో గనుక ఉండి ఉంటే.. ఇటువంటి చర్యలకు పాల్పడిన ప్రజాప్రతినిధిపై కేసీఆర్ కచ్చితంగా వేటు వేసేవారు. కానీ, ఇప్పుడు అంత సన్నివేశం ఉన్నట్టు కనిపించడం లేదు. పార్టీకి నష్టం చేకూర్చే విధంగా మల్లారెడ్డి వ్యాఖ్యలు చేసినప్పటికీ కెసిఆర్ ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదు. పార్టీకి నష్టం చేకూర్చే నాయకులపై కేసీఆర్ ఈ స్థాయిలో ఉదాసీనత ప్రదర్శించడం నిజంగా ఆశ్చర్యంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈటల గెలుస్తున్నాడని మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీనిపై కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. బీఆర్ఎస్, బిజెపి ఒకటే అని ఎందుకు ఇది ఒక ఉదాహరణ అని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను మీపరితంగా సర్కులేట్ చేస్తున్నారు. పాలు నీళ్లు లాగా భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసిపోయారని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి దీనిపై బిజెపి ఎలాంటి కౌంటర్ ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది. అన్నట్టు ఈ వ్యవహారంపై భారత రాష్ట్ర సమితి అనుకూల మీడియా మౌనాన్ని పాటించింది. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం కూడా ష్ గప్ చుప్ అన్నట్టుగా వ్యవహరించింది. ఇతర పార్టీల నాయకులు ఏం చేసినా భూతద్దంలో వెతికే గులాబీ అనుకూల మీడియా.. ఈ విషయంలో సైలెంట్ గా ఉండడం.. ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version