Malla Reddy: అధికారంలో ఉన్నప్పుడు కమాన్ రేవంత్.. రా చూసుకుందామని.. పాల మల్లారెడ్డి అలియాస్ ఇప్పటి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సవాల్ విసిరారు. తొడ కొట్టారు. నానా బూతులు తిట్టారు. కానీ ఇప్పుడు ఏమైంది.. జస్ట్ అధికారం తారు మారయింది. ఫలితంగా మల్లారెడ్డి సీన్ ఒక్కసారిగా మారిపోయింది. సోషల్ మీడియా స్టార్ అంటూ భుజాలు చరచుకున్న ఆయనే.. సైలెంట్ అయిపోయారు. గతంలో రేవంత్ రెడ్డిని తిట్టిన నోటితోనే.. నా ఫ్రెండ్ అని.. త్వరలో కలుస్తానని మీడియా ముందు రేవంత్ రెడ్డిని చల్లబరిచే ప్రయత్నం చేశారు. ఆ మాటలకు లొంగే రకం కాదు కాబట్టి.. పైగా మల్లారెడ్డి తనకు జ్ఞాపకాలు మిగిల్చాడో రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. పైగా మల్లారెడ్డి ఆనుపానులు మొత్తం రేవంత్ రెడ్డికి కి ఎరుకే. అందుకే బుల్డోజర్ ఎక్కుపెట్టాడు. ఒక్క తొక్కుడు తొక్కితే మల్లారెడ్డి ఆక్రమించిన భూములు కొంతవరకు బయటపడ్డాయి. ఆయన అల్లుడు నడి చెరువులో కట్టిన కాలేజీ బిల్డింగు నేలమట్టమయింది. జస్ట్ ఇది శాంపిల్ మాత్రమే నట. అసలు సినిమా ముందుందట.
ఈ తలకాయ నొప్పి భరించలేక మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరుతానని రేవంత్ రెడ్డికి ఆఫర్ ఇచ్చాడట. అయినప్పటికీ మనసు చల్లబడకపోవడంతో.. మల్కాజ్ గిరి పోటీ నుంచి తన కొడుకు భద్రారెడ్డిని తప్పిస్తానని చెప్పాడట. అయినప్పటికీ సానుకూల స్పందన రాలేదు. ఇక గత్యంతరం లేక రేవంత్ రెడ్డి దగ్గరి అనుచరుడు వేం నరేందర్ రెడ్డిని కలిశాడు. తన బాధ చెప్పుకున్నాడు. తన ఆవేదన వెలిబుచ్చుకున్నాడు. పాలు, పూలు అమ్మి సంపాదించింది మొత్తం రేవంత్ పడగొడుతున్నాడు.. అంటూ బాధపడ్డాడు. అంతా విన్నాక.. నేను చేసేది ఏముంది అని వేం నరేందర్ రెడ్డి అన్నాడట. పాపం మల్లారెడ్డి.. బాధాతప్త ముఖంతో బయటికి వచ్చాడు.
అప్పట్లో కాంగ్రెస్ గెలుపుకు కీలకంగా పనిచేసిన డీకే శివకుమార్ హఠాత్తుగా మల్లారెడ్డికి గుర్తుకొచ్చాడు. ఇంకేముంది ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్ళాడు. కొడుకు భద్రారెడ్డిని వెంట పెట్టుకొని పోయాడు. చేతిలో శాలువాతో శివకుమార్ ముందు నిలుచున్నాడు. శాలువా కప్పి.. తన బాధ మొత్తం చెప్పాడు. మరి ఈయన హిందీలో మాట్లాడాడో.. ఆయన కన్నడలో అర్థం చేసుకున్నాడు తెలియదు గానీ మొత్తానికైతే ఆయన చెప్పింది విన్నాడు. అయినా బాధకు భాషతో పనేముంది. మరి రేవంత్ రెడ్డికి డీకే శివకుమార్ కూల్చొద్దు అని ఆదేశాలు ఇస్తాడా? మల్లారెడ్డి మనవాడే ఎటువంటి కోపం పెట్టుకోకు అంటూ సూచిస్తాడా? లేక మన పార్టీలో చేర్చుకోమని సిఫారసు చేస్తాడా? ఏమో ఏమైనా చెప్పని.. ఒకటి మాత్రం నిజం పాలు, పూలు అమ్మిన మల్లారెడ్డికి రోజులు బాగాలేవు. బాగోలేవు అంతే.