Malla Reddy: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు అంటారు పెద్దలు. ఇది అనేక సందర్భాల్లో నిజమైనది కూడా. ప్రస్తుతం తెలంగాణలో కూడా పై సామెత లాగే రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద నిప్పులు చెరిగిన మల్లారెడ్డి అకస్మాత్తుగా తన టోన్ మార్చారు. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్లో ఉండే ఆయన ఒక్కసారిగా శాంత స్వభావుడిగా రూపాంతరం చెందారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా సపోర్ట్ చేస్తానని ప్రకటించారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో లాబీల్లో రాజకీయ నాయకులు విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో క్యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహించే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మల్లారెడ్డి కలుసుకున్నారు. సహజంగానే మల్లారెడ్డి అంటే చింతపండు నవీన్ ఎగిరి పడుతుంటారు.. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విమర్శలు చేస్తూ ఉంటారు. మల్లారెడ్డి భూకబ్జాలు చేశాడని, అతడు చేసిన భూతం దందాలకు సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయని పలుమార్లు తీన్మార్ మల్లన్న ప్రకటించాడు కూడా. అంతేకాదు మల్లారెడ్డి బాధితులతో మాట్లాడాడు కూడా. అయితే ఇదే సందర్భంలో మల్లారెడ్డి ఆదేశాలతోనే మేడిపల్లి పోలీసులు పలుమార్లు నన్ను అరెస్టు చేయించి జైల్లో పెట్టారని మల్లన్న చాలాసార్లు ఆరోపించాడు కూడా. ఒకానొక దశలో మొదటి ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మల్లన్న చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని రద్దు చేసుకున్నాడు. బద్ధ శత్రువుల్లా కనిపించే వీరిద్దరూ అసెంబ్లీ లాబీలో కలుసుకున్నారు. వీరికి కొంతమంది విలేకరులు కూడా జతయ్యారు. సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. వాటికి మల్లారెడ్డి కూడా తన స్టైల్లో సమాధానం చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి తన మద్దతు ఉంటుందని.. రాజకీయాల్లో మాత్రమే శత్రువులమని.. బయట మాత్రం మేము స్నేహితులమని మల్లారెడ్డి విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతేకాదు గత ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న తనపై పోటీ చేస్తే ఏదో ఒక మల్లన్న అసెంబ్లీలోకి అడుగుపెట్టేవాడని వ్యాఖ్యానించారు.. నేను, తీన్మార్ మల్లన్న పాలు అమ్మి ఇక్కడిదాకా వచ్చామని, మా ఇద్దరిదీ పాల కులమని మల్లారెడ్డి చమత్కరించారు. అంత కాదు రేవంత్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేసే మల్లారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి ఆ మాట మార్చడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మొన్నటిదాకా ఎల్బీనగర్ ఎమ్మెల్యే మీద పార్టీ మారతారని అపవాదు ఉండగా.. ఇప్పుడు ఆ జాబితాలో మల్లారెడ్డి కూడా చేరారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు తాను మంత్రిగా ఉన్నప్పుడు తొడ కొట్టి సవాల్ చేసిన మల్లారెడ్డి.. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారు.