Janasena: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అభ్యర్థులను మార్చుతూ అధికార వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఏకంగా రాష్ట్రంలో 11 మంది అభ్యర్థులను మార్చింది. మరో 80 మందిని మార్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో టిడిపి, జనసేన కూటమి లెక్కలు సైతం బయటపడుతున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలో ఆ రెండు పార్టీలు ఒక స్పష్టతకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంకా బీజేపీ విషయంలో ఒక క్లారిటీ రాలేదు. బిజెపి చేరితే వీలైనన్ని ఎంపీ సీట్లు అధికంగా కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అటు జనసేన సైతం కీలక నేతలను ఎంపీ అభ్యర్థులుగా బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఐదు ఎంపీ స్థానాలను పొత్తులో భాగంగా కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బిజెపి విషయం తేలక పోవడంతో.. జనసేన విషయంలో టిడిపి నాన్చుడు ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే జనసేనకు కేటాయించిన మూడు సీట్లపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర నుంచి ఒకటి, ఉభయగోదావరి జిల్లాల నుంచి ఒకటి, కోస్తాలో ఒక సీటును జనసేనకు టిడిపి కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బిజెపి అడుగులు బట్టి ఇంకా సీట్లు పెరిగే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.
ఉత్తరాంధ్రకు సంబంధించి అనకాపల్లి ఎంపీ సీటును ఈసారి జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. ప్రజారాజ్యం సమయంలో అనకాపల్లి నుంచి అల్లు అరవింద్ పోటీ చేశారు. గణనీయమైన ఓట్లు సొంతం చేసుకున్నారు. ఇక్కడ కాపు సామాజిక వర్గం అధికం. ఆ వర్గం నుంచి ఎవరినైనా బరిలో దించితే పొత్తులో భాగంగా సునాయాస విజయం దక్కించుకోవచ్చని జనసేన భావిస్తోంది. అక్కడ బలమైన అభ్యర్థిని పోటీలో దించేందుకు పవన్ యోచిస్తున్నారు. ఒకవేళ పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటు జనసేనకు దక్కితే.. చాలామంది ఆశావాహులు ముందుకు వచ్చే అవకాశం ఉంది.ఇక్కడ వైసిపి సిట్టింగ్ ఎంపీని మార్చే అవకాశం ఉంది.
తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీ స్థానాన్ని జనసేన అడిగినా.. తెలుగుదేశం పార్టీ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏదో ఒక ఎంపీ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తారని సమాచారం. గత ఎన్నికల్లో నరసాపురం నుంచి నాగబాబు పోటీ చేశారు. సుమారు మూడున్నర లక్షల వరకు ఓట్లు సాధించారు. ఈసారి అక్కడ జనసేనకు ఎంపీ స్థానాన్ని కేటాయిస్తే నాగబాబు మరోసారి బరిలో దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కోస్తాలోని మచిలీపట్నం నియోజకవర్గం సైతం జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో జనసేన బలంగా ఉంది. కాపు సామాజిక వర్గం అధికం. అందుకే ఇక్కడ జనసేనకు కేటాయిస్తే పొత్తులో భాగంగా తప్పకుండా విజయం సాధిస్తామని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇవేగాక మరో రెండు ఎంపీ స్థానాలపై జనసేన ఫోకస్ పెట్టినట్లు సమాచారం. పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గాల నుంచి జనసేన అభ్యర్థులు బరిలో దిగితే తప్పకుండా విజయం ఖాయమన్న టాక్ నడుస్తోంది. అయితే కూటమిలోకి బిజెపి ఎంట్రీ తర్వాతే దీనిపై ఒక స్పష్టత రానుంది.