Malla Reddy comments On Kavitha: విషయమేదైనా.. సందర్భం ఏదైనా మల్లారెడ్డి ఎంట్రీ అయితే చాలు.. అక్కడ విశేషం మొత్తం మారిపోతుంది. పైగా ఆయనకు సోషల్ మీడియా స్టార్ అనే బిరుదు కూడా ఉంది. ఏ సందర్భాన్నాయినా సరే తనకు అనుకూలంగా మలచుకోవడంలో మల్లారెడ్డి తనకు తానే సాటి. పైగా ఆయన చేసే వ్యాఖ్యలు రాజకీయాలలో సంచలనం సృష్టిస్తుంటాయి. సోషల్ మీడియాలో ప్రకంపనలకు కారణమవుతుంటాయి. ఇక తాజాగా కారు పార్టీలో చోటు చేసుకున్న సంక్షోభం గురించి మల్లారెడ్డి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అవి ఇప్పుడు కవిత వ్యాఖ్యల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
” మా పార్టీలో ఎటువంటి విభేదాలు లేవు. ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న ఇష్యూస్ వస్తుంటాయి. అవన్నీ మా పెద్ద సారు సాల్వ్ చేస్తుంటారు. ఇది పెద్ద విషయం కాదు. ఆందోళనలు లేవు.. నిరసనలు లేవు. అదంతా ఉత్తిదే. దీనివల్ల పెద్ద ఫరక్ పడదు.. ఇబ్బంది కూడా ఏమీ కాదు. కాలేశ్వరం కమిషన్ మా పెద్ద సార్ ను పిలిస్తే మాకు ఏమీ కాదు. మా సార్ అన్ని చూసుకుంటాడు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాలేశ్వరం కట్టిండు. ఆయన కడిగిన ఆణిముత్యం లాగా బయటికి వస్తడు. ఇదంతా కామన్. స్వల్పకాలికంగా జరుగుతూనే ఉంటది. దానిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిరసన లేదు.. మన్ను లేదు. కుటుంబం అన్నంక ఇట్లాంటియి ఉంటనే ఉంటయి కదా.. వాటన్నింటినీ మా పెద్ద సారు సాల్వ్ చేస్తడు. పెద్ద ఇబ్బంది లేదు. ప్రజలలో రూలింగ్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది. కొత్తగా మేము చేయాల్సిన అవసరం లేదు. వాళ్లలో వాళ్లే మునుగుతరు. మేం కొత్తగా ఎవరిని ముంచాల్సిన అవసరం లేదని” మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.
మల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో కొద్దిరోజులుగా పెద్ద పెట్టున జరుగుతున్న ఈ చర్చను మల్లారెడ్డి కేవలం రెండే రెండు నిమిషాల్లో ముగించడం.. ఇదేం పెద్ద వివాదం కాదని చెప్పడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కొంతకాలంగా గులాబీ పార్టీ అధినేత ఇంట్లో జరుగుతున్న వ్యవహారాల పట్ల ఆ పార్టీ నాయకులు నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తున్నారు. ఎవరూ ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదు.. కేవలం తెలంగాణ అధికార పార్టీని మాత్రమే విమర్శిస్తున్నారు. ఇక గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రస్తుతం విదేశాలలో ఉన్నారు. ఆయన వెంట కొంతమంది కీలక నేతలు వెళ్లిపోయారు.. మొత్తంగా చూస్తే గులాబీ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎవరూ అంతక స్పందించడం లేదు. పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం వారు నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram