Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన మహేశ్‌కుమార్‌గౌడ్ పార్టీపై పట్టు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. తన సారథ్యంలో పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందరకు, విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు పార్టీ నేతలతోనే కాదు, కిందిస్థాయి నేతలతోనూ సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఇదే క్రమంలో పార్టీ సారథిగా పట్టు సాధించాలని భావిస్తున్నారు. బలహీనంగా ఉన్న చోట బలంగా తయారు చేయడం, నేతలను మార్చడం, కొత్తవారిని నియమించడం, పార్టీ పదవుల్లో ఎవరి ప్రాధాన్యం ఇవ్వాలని కేడర్ భావిస్తోందో తెలుసుకోవడం తదితర అంశాలు తెలుసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు కొత్త సారథి. ఈ సమావేశాలకు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్ మున్షి, సహ ఇన్‌చార్జిలు విశ్వనాథం, విష్ణునాథ్ హాజరుకానున్నారు. సమావేశాలకు డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పోటీ చేసి ఓడిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, టీపీసీసీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీలు ఫ్రంట్‌లైన్ చైర్మన్లు హాజరు కావాలని ఆదేశించారు. అయితే సీఎంతో సంబంధం లేకుండా.. పార్టీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
రోజుకు మూడు ఉమ్మడి జిల్లాలు..
త్వరలో నిర్వహించే ఈ సమావేశాలు.. రోజుకు మూడు ఉమ్మడి జిల్లాల చొప్పున నిర్వహించాలని నిర్ణయించారు. పలు అంశాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతంపై ప్రధానంగా చర్చిస్తారు. కొత్త కార్యవర్గ విస్తరణపైనా చర్చించే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ మారిన నేపథ్యంలో కొత్త కార్యవర్గ కూర్పు కూడా అవసరం. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో మెజారిటీ స్థానాలు గెలిచేలా క్యాడర్‌కు దిశానిర్దేశం కూడా చేస్తారని తెలుస్తోంది.
ప్రతిపక్షాలను ఎదుర్కొనేలా..
ఇక ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కొనాలి. ప్రభుత్వంపై అవి చేసే విమర్శలను ఎలా తిప్పికొట్టాలి అనే అంశంపై దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ బాధ్యతను వివరిస్తారు. అందరినీ యాక్టివ్ చేయడమే లక్ష్యంగా సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రుణమాఫీ అంశంతోపాటు రైతు భరోసా, ఆరు గ్యాంటీల అమలు, హామీల అమలు తదితర అంశాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని పార్టీకి అనుకూలంగా ఎలా మార్చాలి అన్న విషయాలను కూడా వివరిస్తారు.